ఈ బడి మూతపడి మూడేళ్లయ్యింది.. తెరిచేదెన్నడో! కర్నూలు జిల్లా ఆదోని మండలం యడవళ్లి గ్రామం... సరిగ్గా కర్ణాటక సరిహద్దుకు కిలోమీటరు దూరంలో ఉంటుంది. సకల అసౌకర్యాలకు నిలయంగా.. పాలకుల నిర్లక్ష్యానికి ఫలితంలా.. ఈ గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. యాడవళ్లిలో 30 ఇళ్లు ఉన్నాయి. దాదాపు 50 మంది విద్యార్థులు ఉన్నారు. వీరు చదువుకునేందుకు ఇక్కడ ప్రభుత్వ పాఠశాల లేదు. ఉన్న బడిని.. మూడేళ్ల క్రితం రకరకాల కారణాలతో మూసేశారు. అది కాస్తా.. ఇలా పశువులకు నిలయమైంది. చెత్తాచెదారానికి చిరునామాగా మారింది.
6 దశాబ్దాల చరిత్ర
యడవళ్లి పాఠశాల చరిత్ర చిన్నదేమీ కాదు. 60 ఏళ్ల క్రితం 1960లోనే ఈ బడిని ఏర్పాటు చేశారు. ఎంతో మంది ఇక్కడి నుంచి విద్యార్థులుగా విజయవంతమయ్యారు. జీవితంలో నిలదొక్కుకున్నారు. రాను రాను ఈ పాఠశాల ప్రాభవం కోల్పోయింది. మూడేళ్ల క్రితం రకరకాల కారణాలతో బడిని మూసేశారు. రవాణా సౌకర్యం సరిగా లేదని.. రహదారులు లేవని.. వర్షం వస్తే వాగు పొంగుతుందని.. రకరకాల కారణాలతో బడి లేకుండా చేశారని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. చదువు కోసం తమ పిల్లలు.. నాలుగైదు కిలోమీటర్లు వెళ్లి రావాల్సివస్తోందని చెప్పారు.
బడి ఒక్కటే కాదు.. మరిన్ని..
యడవళ్లిలో బడి మాత్రమే కాదు. అంగన్వాడీ కేంద్రం లేదు. చౌక ధరల దుకాణం లేదు. వీటికి తోడు.. ఉన్న బడినీ మూసేశారు. మూడేళ్లయినా తెరిపించేందుకు పాలకులు, అధికారులు శ్రద్ధ తీసుకోవడం లేదు. తమ సమస్యలు ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.