కోటి ఆశలతో అత్తారింటికి...కానీ..!
ఇమామ్‌బీకి 22 ఏళ్ల కిందట వివాహమైంది. కోటి ఆశలతో అత్తారింటి గడప తొక్కిన ఈమెకు... ఇద్దరు సంతానం. కొన్నాళ్లకే భర్త ఖలీల్ చనిపోయాడు. అక్కడి నుంచి ఆమె పడని పాట్లు లేవు. చేతికందొచ్చి కష్టాల కడలిని దాటిస్తారునుకున్న పిల్లల్ని నరాల బలహీనత కదలనీయడం లేదు. కూలినాలి చేసుకొని కుటుంబాన్ని పోషించుకునే ఇమామ్‌బీ మదిలోనూ కష్టాలే మెదిలాయి. బిడ్డలతో పాటు తననూ ఆదరిస్తారని పుట్టింటికి వస్తే... అక్కడా అవే కష్టాలు స్వాగతం పలికాయి.
తల్లి రసూల్‌బీ పక్షవాతంతో మంచం పట్టింది. తండ్రీకూతుళ్లు కూలి పనులతో కుటుంబాన్ని పోషించుకునేవారు. ఒకరోజు రసూల్‌బీకి సేవలు చేస్తూ కాలువిరిగిన ఇమామ్‌బీ తండ్రి రాజాసాహెబ్ కదల్లేని పరిస్థితిలో ఉన్నాడు. ఫలితంగా తన పిల్లలతో పాటు... తన తల్లిదండ్రులనూ పోషించాల్సి వస్తోంది. తనకున్న అరకొర ఆర్థికవనరులతోనే... 20 ఏళ్లొచ్చినా కనీసం కూర్చోలేని పిల్లలకు, వయసు మీద పడిన తల్లిదండ్రులకు సేవలందిస్తోంది. ఇమామ్‌బీ పరిస్థితిని చూసి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.