RAJOLI BANDA DAM : మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో ఉన్న రాజోలి బండ డైవర్షన్ పథకంపై రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. పొరుగు రాష్ట్రాలు తెలంగాణా, కర్ణాటకలు నిరంతరాయంగా నీటిని వినియోగించుకుంటుంటే.. ఆంధ్రప్రదేశ్ మాత్రం అవేమీ పట్టనట్టు మొద్దు నిద్ర నటిస్తోంది. తుంగభద్ర డ్యామ్ నుంచి దిగువన నాలుగు టీఎంసీల నీటిని వినియోగించుకునేందుకు అవకాశం ఉన్నా ప్రభుత్వం చోద్యం చూస్తోంది. దీంతో కర్నూలు జిల్లాలోని మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాలకు తాగు, సాగునీరు అందని పరిస్థితి నెలకొంది.
రాజోలిబండ నుంచి 4 టీఎంసీల నీటిని ఏపీ వినియోగించుకునే అవకాశముందంటూ కృష్ణా జలవివాదాల ట్రైబ్యునల్ అనుమతి ఇచ్చింది. ఈ నీటిని సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా గత ప్రభుత్వ హయాంలో రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ ద్వారా కాలువల నిర్మాణానికి ప్రభుత్వం పరిపాలనా అనుమతులు జారీ చేసింది. 1985 కోట్ల వ్యయంతో ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టు నిర్మించేందుకు అప్పటి ప్రభుత్వం టెండర్లు కూడా పిలిచింది.
కుడివైపున కాలువ నిర్మించి తుంగభద్ర నుంచి రోజుకు 21.81 క్యూసెక్స్ చొప్పున 60 రోజుల పాటు 4 టీఎంసీల నీటిని వినియోగించుకోవాలని ప్రణాళిక సిద్ధం చేశారు. తద్వారా మూడు నియోజకవర్గాల్లో 40 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలన్నది లక్ష్యం. మొత్తం 160 కిలో మీటర్ల పొడవున కాలువ నిర్మించి 4 చోట్ల రిజర్వాయర్లు నిర్మించేందుకు ప్రణాళిక చేశారు. కోసిగి, పెద్దకడబూరు, కోట్టెకల్లు, చిన్నమరివీడుల వద్ద జలాశయాలు నిర్మించేలా కార్యాచరణ చేశారు. నాలుగు ఎత్తిపోతల పథకాల ద్వారా 40 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలని ప్రతిపాదించారు. ఇందుకోసం రాజోలిబండ అనకట్ట వద్ద నీటి మళ్లింపు కోసం కొంతమేర సివిల్ పనులు చేశారు. నీటిని తోడుకునేందుకు హెడ్ రెగ్యలేటర్ నిర్మాణం పూర్తి అయ్యింది.