Girlfriend Died Due To BoyFriend Harassment: తనను ప్రేమించి పెళ్లి చేసుకోవాలని, లేదంటే పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకోవాలని యువకుడు వేధించడంతో భరించలేక ఇంటర్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిన ఘటన తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఏఎస్సై చంద్రమౌళి తెలిపిన వివరాల ప్రకారం.. బోయినపల్లి మండలం తడగొండకు చెందిన త్రిష (18) గంగాధరలోని ఓ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. అదే గ్రామానికి చెందిన సహ విద్యార్థి సతీశ్ తనను పెళ్లి చేసుకోవాలంటూ ఆమెను తరచూ వేధించేవాడు.
త్రిష ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలపగా.. వారు సతీశ్‌ను కట్టడి చేయాలంటూ అతడి తల్లిదండ్రులకు సూచించారు. సోమవారం త్రిష ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో నన్ను పెళ్లి చేసుకుంటావా? ఆత్మహత్య చేసుకుంటావా అంటూ సతీశ్ ఆమెకు పురుగు మందు ఇచ్చాడు. అతడి వేధింపులు భరించలేక ఆమె పురుగు మందు తాగేసింది. ఈలోగా ఆమె అక్క రావడంతో సతీశ్ పారిపోయాడు.