కర్నూలు జిల్లా ఆత్మకూరులో చేపట్టిన వినాయక నిమజ్జన శోభాయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. డ్రమ్స్ వాయిద్యాల మధ్య యువకులు, చిన్నారుల నృత్యాలతో శోభయాత్ర ప్రారంభం కాగా...డ్రమ్స్కు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. శోభాయాత్రను ఆపేసి యువకులు నిరసనకు దిగారు. చాలాసేపటి తర్వాత పోలీసులు దిగిరావటంతో యువకులు శాంతించారు. శోభాయాత్ర తిరిగి ఉత్సహంగా కొనసాగింది.
గూడురులో ఉద్రిక్తత...
గూడూరు నగర పంచాయతీలో ఆదివారం వినాయక నిమజ్జనంలో ఉద్రిక్తత కొనసాగింది. నిమజ్జనానికి డీజే అనుమతి లేదని పోలీసులు తెలపడంతో బస్టాండ్ కూడలి వద్ద పెద్ద ఎత్తున స్థానికులు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా నిరసనకారులు మాట్లాడుతూ.. సీఎం తండ్రి వర్ధంతికి వర్తించని కొవిడ్ నిబంధనలు.. వినాయక నిమజ్జనానికి వర్తిస్తాయా అని ప్రశ్నించారు. ఉదయం ప్రారంభమైన నిరసన ఇంకా కొనసాగుతునే ఉంది. పోలీసులు రంగప్రవేశం చేసి నిరసనకారులను చెదరగొట్టారు. అయినప్పటికీ నిరసన కొనసాగిస్తూనే ఉన్నారు.