ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 11, 2021, 4:56 PM IST

ETV Bharat / state

విత్తుకు సిద్ధం.. ఆర్‌బీకేల్లో పేర్ల నమోదుకు చర్యలు

రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం విత్తన సేకరణలో మార్పులు తీసుకొచ్చింది. ఇందులో భాగంగానే కర్నూలు జిల్లాలో గత మార్చి నుంచి ఏపీ సీడ్స్‌ ద్వారా అధికారులు విత్తన సేకరణ చేపట్టారు. సేకరించిన విత్తన కాయలను ప్రాసెసింగ్‌ చేసి గోదాముల్లో నిల్వ ఉంచారు. వాటిని ఆయా ప్రాంతాల్లోని రైతు భరోసా కేంద్రాలకు వాహనాల్లో తరలిస్తున్నారు.

seeds packing
seeds packing

విత్తనోత్పత్తి చేపట్టి రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం విత్తన సేకరణలో మార్పులు తీసుకొచ్చింది. గతంలో రైతుల ముసుగులో దళారులు ప్రభుత్వ విత్తన సంస్థలకు విక్రయించి సొమ్ము చేసుకునేవారు. ఈ నేపథ్యంలో విత్తనోత్పత్తి చేసే రైతుల నుంచే ప్రభుత్వం వేరుసెనగ విత్తన కాయలను సేకరిస్తోంది. విత్తనాలను నేరుగా రైతుల నుంచే కొనుగోలు చేయాలని, ఏ జిల్లాకు అవసరమైన విత్తనాన్ని ఆ జిల్లాలోనే సేకరించాలని ఉత్తర్వులు ఇచ్చింది. కర్నూలు జిల్లాలో గత మార్చి నుంచి ఏపీ సీడ్స్‌ ద్వారా అధికారులు విత్తన సేకరణ చేపట్టారు.

52 వేల క్వింటాళ్ల సేకరణ:

కర్నూలు జిల్లాలో 57,985 క్వింటాళ్ల వేరుసెనగ విత్తన కాయలను కొనుగోలు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు 52 వేల క్వింటాళ్లను సేకరించారు. మిగిలిన విత్తనాన్ని నేషనల్‌ సీడ్‌ కార్పొరేషన్‌(ఎన్‌ఎస్‌సీ) ద్వారా సేకరించేలా చర్యలు చేపట్టారు. సేకరించిన విత్తన కాయలను ప్రాసెసింగ్‌ చేసి గోదాముల్లో నిల్వ ఉంచారు. వాటిని ఆయా ప్రాంతాల్లోని రైతు భరోసా కేంద్రాలకు వాహనాల్లో తరలిస్తున్నారు.

రైతుల నుంచి నాణ్యత కలిగిన కె-6 రకం వేరుసెనగను మాత్రమే సేకరించాల్సి ఉంది. 9 శాతం లోపు తేమ ఉండాలి. పప్పు శాతం 74కుపైగా ఉండాలి. ప్రభుత్వ మద్దతు ధర క్వింటా రూ.6,400, 6,500 చొప్పున రెండు రకాలుగా కొనుగోళ్లు జరుగుతున్నాయి. విత్తన సేకరణ బాధ్యతను ఆంధ్రప్రదేశ్‌ విత్తనాభివృద్ధి సంస్థ(ఏపీ సీడ్స్‌)కు అప్పగించారు. వ్యవసాయ శాఖ, ఏపీ సీడ్స్‌, విత్తన ధ్రువీకరణ సంస్థ, విత్తన కేంద్రాల సమన్వయంతో 52 వేల క్వింటాళ్ల విత్తనాన్ని సేకరించారు.

గరిష్ఠంగా మూడు ప్యాకెట్లు:

రైతుల నుంచి వేరుసెనగ విత్తన కాయలను కొనుగోలు చేసిన ప్రభుత్వం వాటిని ప్రాసెసింగ్‌ చేసిన తర్వాత అదే విత్తనాన్ని క్వింటా రూ.8,680కు ఇచ్చేలా ధర నిర్ణయించింది. నిఖర ధరలో 40 శాతం రాయితీ (రూ.3,374)ని ప్రకటించింది. రైతులు కిలో వేరుసెనగ విత్తన కాయలను రూ.52.08కు కొనుగోలు చేయాల్సి ఉంది.

ఒక రైతుకు గరిష్ఠంగా మూడు ప్యాకెట్లు (90 కేజీలు) పంపిణీ చేయనున్నారు. అర ఎకరా రైతుకు ఒక ప్యాకెట్‌ (30 కిలోలు), ఎకరా ఉంటే 2 ప్యాకెట్లు (60 కిలోలు), ఎకరాకుపైగా ఉంటే మూడు ప్యాకెట్లు (90 కిలోలు) అందించనున్నారు.

ముందస్తుగా పేర్ల నమోదు:

జిల్లాలో పత్తికొండ, డోన్‌, ఆలూరు, ఎమ్మిగనూరు, ఆదోని, మంత్రాలయం, కర్నూలు సబ్‌ డివిజన్లలో ఎక్కువగా వేరుసెనగ సాగవుతోంది. జిల్లాలో 491 రైతు భరోసా కేంద్రాలకు వేరుసెనగ విత్తనాలను కేటాయించగా ఏపీ సీడ్స్‌ అధికారులు ఆర్‌బీకేలకు పంపిణీ చేసిన వేరుసెనగ విత్తన నాణ్యతను మండల వ్యవసాయాధికారి ధ్రువీకరించిన తర్వాతనే పంపిణీకి అనుమతిస్తున్నారు. వేరుసెనగ విత్తనం కావాల్సిన రైతులు ముందుగా ఆర్‌బీకేలలో డి.క్రిషి యాప్‌లో పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంది. సచివాలయాల్లో కొందరు గ్రామ సచివాలయ సహాయకులు(వీఏఏ)లు కరోనా బారిన పడటంతో మూడు విడతలుగా ఆర్‌బీకేలలో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ చేపడుతున్నారు. మొదటి విడతలో 198 ఆర్‌బీకేల్లో ప్రారంభమైంది.

వారం రోజుల్లో నగదు జమ

ఏపీ సీడ్స్‌ ఆధ్వర్యంలో 52 వేల క్వింటాళ్ల నాణ్యమైన కె-6 రకాన్ని సేకరించాం. ఇప్పటివరకు 42 వేల క్వింటాళ్లకు నగదు చెల్లింపులు పూర్తి చేశాం. వారం రోజుల్లో మిగిలిన రైతుల ఖాతాలకు జమ చేస్తాం. సేకరించిన విత్తనంలో 50 శాతం విత్తనాన్ని ప్రాసెసింగ్‌ చేశాం. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 9 వేల క్వింటాళ్ల విత్తనాన్ని రైతు భరోసా కేంద్రాలకు పంపాం.

- శ్రీనివాసరావు, ఏపీ సీడ్స్‌ జిల్లా మేనేజర్‌

అంశం: వేరుసెనగ విత్తన సేకరణ

లక్ష్యం: 57,985 క్వింటాళ్లు

సేకరించింది:52,000 క్వింటాళ్లు

నిల్వ చేసే ప్రాంతాలు:ప్రాసెసింగ్‌ తర్వాత కర్నూలు, ఓర్వకల్లు, డోన్‌, పత్తికొండ, మద్దికెర, ఆదోని గోదాముల్లో నిల్వ.

కేటాయించిన సొమ్ము:రూ.34.32 కోట్లు

చెల్లించినది:రూ.27.72 కోట్లు

బకాయిలు:రూ.6.60 కోట్లు

ఇదీ చదవండి:

పూల వ్యాపారానికి కర్ఫ్యూ సెగ.. వెసులుబాటు కల్పించాలని ఆక్రందన!

ABOUT THE AUTHOR

...view details