ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 29, 2021, 10:26 AM IST

ETV Bharat / state

కుటుంబాన్ని బలి తీసుకున్న అధిక రుణాలు.. అవమాన భారం..

అధిక అప్పులు చేసిన ఆ కుటుంబ పెద్దకు వాటిని తీర్చే దారి కనిపించలేదు. తీసుకున్న రుణాలు తీర్చాలని అప్పిచ్చిన వారు అడగటం.. అవమానంగా భావించారేమో.. ఇద్దరు కుమార్తెలతో కలిసి భార్యాభర్తలిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు.

family committed suicide
కుటుంబాన్ని బలి తీసుకున్న అధిక రుణాలు

అప్పులు, అధిక వడ్డీల భారం తట్టుకోలేక కర్నూలు జిల్లా నంద్యాల మాల్దార్‌పేటకు చెందిన.. మంచా చంద్రశేఖర్‌ తన భార్యాబిడ్డలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డటం పలువురిని కలచివేసింది. చంద్రశేఖర్‌, కళావతి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. అంజనీదేవి ప్రస్తుతం పదో తరగతి, అఖిల 8వ తరగతి చదువుతున్నారు. అప్పులు తీర్చే దారి లేక బిడ్డలతో సహా దంపతులు బలవన్మరణాలకు పాల్పడటంతో బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. సంఘటనా స్థలానికి ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డి, డీఎస్పీ చిదానందరెడ్డి చేరుకుని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడం సరైంది కాదన్నారు. సమస్య ఉంటే పోలీసులు, ప్రజాప్రతినిధులు ఉన్నారని వాటిని పరిష్కరిస్తారన్నారు.

సైనెడ్‌ ఎలా వచ్చింది: గతంలో చంద్రశేఖర్‌ బంగారం పని చేసేవారు. బంగారు దుకాణం యజమానులు కూడా అతనికి పరిచయమే. ఈ పరిచయంతోనే సైనెడ్‌ అతనికి లభించినట్లు సమాచారం. ఈ సైనెడ్‌ను ప్రభుత్వం కొన్నేళ్ల క్రితమే నిషేధించింది.

అందరూ ఒకేసారి తాగారా?: సంఘటనా స్థలంలో ఒకేచోట నాలుగు గ్లాసులు పడి ఉన్నాయి. ఒకేసారి నలుగురు కలిసి తాగారా? ముందు చంద్రశేఖర్‌ తాగిన తర్వాత భార్య, పిల్లలు తాగి ఉంటారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రశేఖర్‌ మృతదేహం నల్లగా మారడంతో అతనే ముందుగా సైనెడ్‌ తాగి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. చంద్రశేఖర్‌, ఇద్దరు కుమార్తెల మృతదేహాలు ఒకచోట, భార్య మృతదేహం పడక గదిలో ఉంది.

అప్పుల ఒత్తిడే కారణం: ఇటు బ్యాంకులో గృహానికి తీసుకున్న రుణంతోపాటు బయట అధిక వడ్డీలకు తీసుకున్న అప్పులు కలిసి సుమారు రూ.కోటికి పైగా ఉన్నట్లు మృతుడి బంధువులు తెలిపారు. వడ్డీలు చెల్లించాలని ప్రతి నెలా రుణదాతలు ఒత్తిడి చేసేవారు. వారికి చెల్లించలేక తాను చనిపోయినా భార్య, పిల్లలను కూడా వదలరని భావించి అందరూ కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారని అనుమానిస్తున్నారు. రూ.50 లక్షలు పెట్టి ఇల్లు కట్టగా, మిగతావి వేరే అవసరాలకు వాడినట్లు చెబుతున్నారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

అప్పులు ఎలా అధికమయ్యాయి..?
* చంద్రశేఖర్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిసింది. అదే క్రమంలో గత కొన్ని రోజుల క్రితం నూతనంగా ఇంటిని నిర్మించాడు. ప్రస్తుతం క్రికెట్ బెట్టింగ్ కొనసాగిస్తున్నాడా.. లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. ఇల్లు కట్టడానికి అప్పు చేశాడా..బెట్టింగ్ నిర్వహణకు అప్పు చేశాడా స్పష్టత లేదు.

ఇదీ చదవండి:

నంద్యాలలో దారుణం.. ఒకే ఇంట్లో నలుగురు ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details