మూడు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో తల్లి మృతి చెందింది.. మద్యానికి బానిసై వారం క్రితమే తండ్రి ప్రాణాలు కోల్పోయాడు.. దీంతో.. నలుగురు పిల్లలు దిక్కులేని వారయ్యారు. వారిలో 13 సంవత్సరాల పెద్ద అమ్మాయే.. తోబట్టువులకు అన్నీ తానై పోషిస్తోంది. ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తోంది. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలోని వి.తిమ్మాపురం గ్రామంలోనిదీ విషాద గాథ.
వి.తిమ్మపురం ఒక మారుమూల గ్రామం. మాల రాముడు, లక్ష్మికి నలుగురు సంతానం. ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. దేవి (13), రాజీ (10), శీను (8), భీమ (6). తల్లి లక్ష్మి మూడు సంవత్సరాల క్రితం 38 ఏళ్ల వయసులోనే అనారోగ్యంతో మృతిచెందింది. అప్పటి నుండి తండ్రి కూలి పనులు చేస్తూ నలుగురు పిల్లలు ఆలనా పాలనా చూసుకొనేవాడు. భార్య మృతిని జీర్ణించుకోలేక భర్త మద్యానికి బానిస అయ్యాడు. మూడు రోజుల క్రితం రాముడు (42) కూడా అనారోగ్యంతో మృతిచెందాడు.