కర్నూలు జిల్లా బనగానపల్లె తెదేపా మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి(BC Janardhana reddy)కి బెయిల్ మంజూరు అయింది. జిల్లా ఎస్సీ ఎస్టీ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత నెల 23న ఘర్షణ కేసులో ఆయనను అదే రోజు అర్ధరాత్రి పోలీసులు అరెస్టు చేశారు. అప్పట్లో ఆయనపై ఐపీసీ సెక్షన్లు 307, 147, 148, 324, 341తోపాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అప్పటినుంచి ఆయన ఆదోని సబ్ జైల్లో ఉన్నారు. సుమారు ఇరవై తొమ్మిది రోజుల తర్వాత ఆయనకు బెయిల్ మంజూరు అయింది. ఈ నేపథ్యంలో.. బనగానపల్లిలో ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
సీఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో.. ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి స్వగృహం, మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ఇళ్ల సమీపంలో ప్రత్యేక పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. అలాగే పట్టణంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులను మోహరించారు. ఇది ఇలా ఉండగా.. సాయంత్రం సమయం మించిపోవడంతో ఆదోని సబ్ జైల్ అధికారులు బీసీ జనార్దన్ రెడ్డిని విడుదల చేసేందుకు నిరాకరించారు. నేడు ఆయన సబ్ జైలు నుంచి విడుదల అయ్యే అవకాశం ఉంది. బెయిల్ మంజూరు కావడంతో.. బనగానపల్లిలో తెదేపా నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.