ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కుటుంబాన్ని చిదిమేసిన పిడుగు.. ముగ్గురు మృతి - కర్నూలులో పిడుగు పడి ఇద్దరు దుర్మరణం వార్తలు

పిడుగు పడి ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందిన ఘటన కర్నూలు జిల్లా పెద్దహ్యాటలో జరిగింది. భోగరాజు అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి మేకలు మేపుతుండగా.. ఈ విషాదం చోటు చేసుకుంది. ఇదే ఘటనలో 30 మేకలు సైతం మృత్యువాత పడ్డాయి. మూడేళ్ల చిన్నారి మాత్రం సురక్షితంగా బయటపడింది.

పిడుగు పాటుకు తండ్రి కుమార్తె మృతి
పిడుగు పాటుకు తండ్రి కుమార్తె మృతి

By

Published : May 10, 2021, 7:18 PM IST

Updated : May 11, 2021, 12:07 PM IST

కర్నూలు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పిడుగు పాటుకు గురై ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోగా..ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. హొళగుంద మండలం పెద్దహ్యేట గ్రామానికి చెందిన భోగరాజు (36), మల్లమ్మ(30) దంపతులకు నలుగురు కుమార్తెలు సంతానం. కుటుంబపోషణలో భాగంగా తమకున్న 40 మేకలను పెంచుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కుమార్తెలు రేవతి (6), మల్లేశ్వరి(4), వెన్నెల(3)తో కలిసి దంపతులు సోమవారం మేకలను మేపేందుకు గ్రామశివారుకు వెళ్లారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. దీంతో అందరూ మేకలను తీసుకుని సమీపంలోని వేప చెట్టు కిందకు వెళ్లారు. అదే సమయంలో చెట్టు వద్ద ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పిడుగు పడింది. దాని ప్రభావానికి గురై భోగరాజు, కుమార్తె రేవతి ఘటనా స్థలంలోనే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మల్లమ్మ, మల్లేశ్వరిని హొళగుంద ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. మల్లమ్మ పరిస్థితి విషమించడంతో ఆదోని ఆస్పత్రికి తరలిస్తుండగా తుదిశ్వాస విడిచారు. ఇదే ఘటనలో 30 మేకలు సైతం మృత్యువాత పడ్డాయి.
మృత్యుంజయురాలు ఈ చిన్నారి
ఈ ఘటనలో మూడేళ్ల చిన్నారి వెన్నెల క్షేమంగా బయటపడింది. వర్షం పడుతున్న సమయంలో తల్లి మల్లమ్మ ..వెన్నెలను తన ఒడిలో ఉంచుకుని చెట్టు కిందకు వెళ్లారు. పిడుగుపాటుకు గురైనప్పుడు మల్లమ్మ బోర్లా పడిపోయారు. తీవ్రగాయాలపాలై మృతిచెందారు. మూడేళ్ల చిన్నారికి మాత్రం ఏమీ కాకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ముందుగానే ప్రమాదాన్ని గ్రహించిన తల్లి చిన్నారిని హత్తుకుని బోర్లా పడటంతో వెన్నెల ప్రాణాలతో బయటపడిందని బంధువులు చెబుతున్నారు.

Last Updated : May 11, 2021, 12:07 PM IST

ABOUT THE AUTHOR

...view details