కర్నూలు జిల్లాలో నకిలీ విత్తనాల బాగోతం చాపకింద నీరులా విస్తరిస్తోంది. వరి, పత్తి, మిరప, కూరగాయలకు సంబంధించిన నకిలీ విత్తనాలను సృష్టించి మార్కెట్‌లో రైతులకు అంటగడుతున్నారు. సాధారణంగా పండించిన చోటే విత్తన కొరత ఉంటుంది. ఈ సమయంలోనే కొందరు దళారులు రైతులను ఆశ్రయించి కొంత విత్తనాన్ని ముందుగా సేకరిస్తారు. డిమాండ్‌ను బట్టి సేకరించిన విత్తనాలకు తోడు నకిలీ విత్తనాలు జోడించి మార్కెట్ చేస్తారు. పైగా కంపెనీలు ప్రాసెసింగ్ చేసే సమయంలో క్లీన్ సీడ్ (విత్తనం), రెమినెంట్ సీడ్ (తాలు, ఇతర విత్తనాలు) అనే రెండుగా విడగొడుతాయి. తాలు, నాణ్యత లేని విత్తనాలను దళారులు దాణా పేరుతో కొనుగోలు చేసి ఆకర్షణీయంగా ప్యాకింగ్ చేస్తారు. తక్కువ ధర పేరుతో రైతులకు అమ్ముతున్నారు.
తనిఖీలంటే ఇలాగేనా?
జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు 6.36 లక్షల హెక్టార్లు కాగా ఏటా సాగు విస్తీర్ణం పెరుగుతోంది. దీనికి తగ్గట్టు ధ్రువీకరణ కంపెనీల వద్ద రైతుల డిమాండ్‌కు అనుగుణంగా విత్తనాలను సరఫరా చేయలేకపోతున్నారు. మరోవైపు పలువురు రైతులు నిరక్షరాస్యులవడం, వారి అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని నకిలీలు రాజ్యమేలుతున్నాయి. ఈ ఏడాది గుంటూరు వ్యవసాయశాఖ కమిషనరేట్ కార్యాలయం నుంచి ఏడీఏ గోపాల్, ఏవో సురేష్ బృందం జిల్లాలో నంద్యాల పరిధిలోని విత్తన ప్రొసెసింగ్ యూనిట్లను తనిఖీ చేసింది. హెచ్‌టీ పరీక్షకు సంబంధించి 25 నమూనాలను సేకరించగా అన్నీ నెగిటివ్ వచ్చినట్లు తెలిపారు. మరోవైపు జిల్లా వ్యవసాయాధికారులు సైతం ఏప్రిల్ నెలలో పత్తి విత్తన ప్రాసెసింగ్, ప్యాకింగ్ యూనిట్లను తనిఖీ చేసేందుకు 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు చేయకపోవడం గమనార్హం. ఈ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఒకవేళ తిరిగినా ఆమ్యామ్యాల కారణంగా లోపాలను ఎత్తిచూపడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇలాంటివి ఎన్నో...
దొర్నిపాడు మండల కేంద్రానికి చెందిన రామశేషయ్య నిషేధిత పత్తి విత్తనాలు విక్రయిస్తూ ఈ ఏడాది ఏప్రిల్ నెలలో పట్టుబడ్డారు. మంచిర్యాల జిల్లా భీమవరంలో 160 కిలోల నకిలీ విత్తనాలను సమ్మయ్య అనే రైతుకు అమ్ముతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీటి విలువ రూ.2.70 లక్షలుగా గుర్తించారు. ● జిల్లాలో గతేడాది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించగా రూ.2.50 కోట్ల విలువ చేసే నిషేధిత పత్తి విత్తనాలు (హెచ్‌టీ) గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
హెచ్‌టీ పత్తి విత్తనాలతో...