కర్నూలు జిల్లా బనగానపల్లెలో మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. వైకాపా నాయకులు అక్రమంగా వాగులను ఆక్రమించుకుని లేఅవుట్ వేసి కోట్లకు అమ్ముకుంటున్నారన్నారు. నంద్యాల రోడ్డు వద్ద ఉన్న రక్షణ గోడను కూల్చివేసి చదును చేసి ప్లాట్లుగా మార్చుకుంటున్నారని అక్కడే రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
నిత్యం వందల సంఖ్యలో వాహనాలు వెళ్లే నంద్యాల రహదారిలో రక్షణ కోసం ఏర్పాటు చేసిన గోడను కూల్చేసి ప్లాట్లుగా మార్చినా.. ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి చోద్యం చూస్తున్నారని ఆరోపించారు. రోడ్డుపై బైఠాయించడంతో నంద్యాల-బనగానపల్లె వెళ్లే వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.
పోలీసులు అక్కడికి చేరుకుని నిరసన విరమించుకోవాలని కోరారు. ప్రజలకు అంతరాయం కలుగుతుందని.. చట్టపరంగా అనుమతి లేకుండా నిరసన చేయడంపై ఎస్సై మహేష్ కుమార్ ప్రశ్నించారు. అధికారులు వచ్చి న్యాయం చేస్తామని చెప్పేవరకు నిరసన వ్యక్తం చేస్తానని చెప్పారు. తహసీల్దార్ ఆల్ఫ్రెడ్ను అక్కడికి రప్పించగా.. చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.