కర్నూలు జిల్లా పల్లెపోరు సంగ్రామం ఆదివారంతో ముగిసింది. ఉత్కంఠ పోరు చూసి.. ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే పురపాలక ఎన్నికలు దగ్గర పడ్డాయి. ఇంకేముంది నేతలు, నాయకుల దృష్టి ఆయా మున్సిపాల్టీలపైకి మళ్లిస్తున్నారు. పదునైన వ్యూహాలతో అడుగులు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే నామపత్రాల స్వీకరణ పర్వం ముగిసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆ సమయంలో బెదిరింపులతో నామినేషన్లు దాఖలు చేయకుండా చేశారంటూ కొందరు ఎస్‌ఈసీ దృష్టికి తీసుకెళ్లినా నిర్ణయం మారలేదు. అధికార పార్టీ గెలుపునకు పావులు కదుపుతుండగా, ప్రతిపక్ష పార్టీ నిలబెట్టిన స్థానాల్లో ఎట్టి పరిస్థితుల్లోనైనా గట్టి పోటీ ఇచ్చి విజయం సాధించేందుకు సన్నద్ధమవుతోంది.
* జిల్లాలో కర్నూలు కార్పొరేషన్‌తోపాటు ఆత్మకూరు, నందికొట్కూరు, నంద్యాల, ఆళ్లగడ్డ, డోన్, ఆదోని, ఎమ్మిగనూరు పురపాలక సంఘాలు, గూడూరు నగర పంచాయతీతో కలిపి తొమ్మిదిచోట్ల వచ్చే నెల 10న ఎన్నికలు జరగనున్నాయి. ఈ తొమ్మిది పురపాలకాల్లో 302 వార్డులకు 2,061 నామపత్రాలు దాఖలయ్యాయి. ఇందులో వైకాపా 790, తెదేపా 514, భాజపా 146 నామినేషన్లు అందించినట్లు సమాచారం. కర్నూలు మేయర్ పదవి బీసీ జనరల్‌కు రిజర్వు కావడంతో ఆశావహులు అన్ని పార్టీల నుంచి ఎక్కువగానే ఉన్నారు.
* ఆఖరున తెదేపా మేయర్ అభ్యర్థి: తెలుగుదేశం పార్టీ తొలుత వార్డు సభ్యులను గెలిపించుకునేందుకు పావులు కదుపుతున్నారు. కర్నూలు, నంద్యాల, ఆదోని వంటి చోట్ల ఎక్కువ విజయాలు సొంతం చేసుకోవాలని చూస్తున్నారు. కార్పొరేషన్ ఎన్నికలు పూర్తయి, డివిజన్లలో గెలుపు ఆధారంగా మెజార్టీ వచ్చాక మేయర్ అభ్యర్థిని నిర్ణయించనున్నారు. ఈ అభ్యర్థి ఎంపిక నేరుగా పార్టీ అధినేత చంద్రబాబు సూచించనున్నట్లు సమాచారం.