* కర్నూలు నగరంలోని ఓ కుటుంబం ఉమ్మడిగా ఉంటోంది. గత నెల ఆ కుటుంబంలో అందరికి కరోనా లక్షణాలు కనిపించగా, సీటీ స్కాన్ పరీక్షలు చేయించారు. ఎనిమిది మందికి ఒకేసారి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇందులో 50 ఏళ్లు పైబడిన వారున్నారు. ఆసుపత్రికి ప్రత్యేకంగా ఒకరు తీసుకెళ్లే వీల్లేక, తెలిసిన వైద్యుల సూచనతో ఇంట్లోనే మందులు వాడుతూ చికిత్స తీసుకున్నారు. ఈలోగా ఇద్దరికి అర్ధరాత్రి ఆక్సిజన్ శాతం తగ్గింది. ఆ సమయంలో ప్రైవేటు ఆసుపత్రుల గడప తొక్కగా అతి కష్టంపై పడకలు కేటాయించారు. వెంటిలేటర్లపై ఉంచి చికిత్స చేస్తుండగా ఒకరు మృత్యువాత పడ్డారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
* ఆదోనిలో ఒకే కుటుంబంలోని నలుగురు సభ్యులకు కరోనా సోకింది. అందరూ వైరస్ బారిన పడటం, లక్షణాలు ఎక్కువగా ఉండటంతో హెడ్ కానిస్టేబుల్ చికిత్స పొందుతూ ఈ నెల 3న మృతి చెందారు. ఆయన భార్య సైతం కర్నూలు సర్వజన వైద్యశాలలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఇద్దరు కుమారులు ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో చికిత్స పొందుతున్నారు.
కొత్త వైరస్ తీవ్రతరంగా...
ప్రస్తుతం కరోనా రెండో అల జిల్లాలో వేగంగా విస్తరిస్తోంది. ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు కేవలం నెల రోజుల వ్యవధిలో 27,322 కేసులు నమోదయ్యాయంటే తీవ్రత అర్థం చేసుకోవచ్చు. మహమ్మారితో జిల్లాలో నెల రోజుల్లో 79 మరణాలు చోటు చేసుకున్నాయి. నమోదవుతున్న కేసుల్లో 5% నమూనాలను సేకరించి హైదరాబాద్‌లోని సీసీఎంబీ ల్యాబ్‌కు పంపుతున్నారు. రెండో దఫా వైరస్‌లో యూకే, సౌత్‌ఆఫ్రికా వేరియంట్(డబుల్ మ్యూటెంట్) కనిపిస్తోందని, దీని విస్తరణ వేగంగా ఉండటంతోపాటు, వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండి మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయని జిల్లా సర్వేలెన్స్ అధికారి డాక్టర్ రామాంజనేయులు ‘ఈనాడు’తో తెలిపారు.
ఇలా మొదలై... అలా ముగుస్తోంది
కుటుంబంలో లక్షణాలు కనిపించాక అందరూ ఒకేచోట ఉంటున్నారు. అందరికీ కరోనా వచ్చింది కదా? అన్నట్లు సామాజిక దూరం పాటించకపోవడం, మాస్కులు ధరించక పోవడం, శానిటైజేషన్ చేయకపోవడంతో వైరస్ తీవ్రత బలపడుతోంది. పల్స్ ఆక్సీమీటరుతో ఆక్సిజన్ స్థాయి పరిశీలించుకోక పోవడం వల్ల అత్యవసరం ఏర్పడుతోంది. ప్రైవేటు ఆసుపత్రులు పడకలు ఖాళీ లేవంటూ డిమాండ్ పెంచేస్తున్నారు. వైరస్‌తో అప్పటికే దెబ్బతిన్న ఊపిరితిత్తులతో మృత్యువాత పడుతున్నారు.