ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వరుణుడు కరుణించలేదు... నీటి గోస తీరలేదు

స్నానం చేయడానికే రెండు బకెట్ల నీరు వాడుతుంటుంటారు. అలాంటిది  కేవలం వారమంతా ఒక్క బిందెడు నీటితోనే సరిపెట్టుకోవాల్సి వస్తే... పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కర్నూలు జిల్లాల్లో ప్రస్తుతం అదే దుస్థితి నెలకొంది.

By

Published : Aug 1, 2019, 11:45 PM IST

కర్నూలు

వరుణుడు కరుణించలేదు... నీటి గోస తీరలేదు

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నా కర్నూలు జిల్లాలో మాత్రం ఆశించినమేర పడలేదు. ఎండాకాలం ప్రారంభం కాకముందే మొదలైన నీటిఎద్దడి వర్షాకాలంలోనూ కొనసాగుతోంది. అప్పటికంటే ఇంకా తీవ్రమైంది. జిల్లాలో తాగునీటికి ఆధారమైన గాజులదిన్నె, సుంకేసుల, వెలుగోడు, అలగనూరు, గోరుకల్లు జలాశయాలన్నీ వానలు లేక అడుగంటాయి. కనీసం ఎగువ ప్రాంతంలోనూ వర్షాలు పడక తుంగభద్రలోనూ నీరు చేరలేదు. ఫలితంగా... జిల్లావ్యాప్తంగా తాగునీటి కటకట తీవ్ర స్థాయిలో ఉంది.

అడుగంటిన జలాశయాలు

కర్నూలుకు ప్రధాన తాగునీటి వనరైన సుంకేసుల జలాశయం ఎప్పుడో ఎండిపోయింది. గాజులదిన్నె జలాశయంపై ఆధారపడాల్సి వచ్చింది. ఇందులోనూ నీరు అయిపోగా... సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నుంచి నీటిని తీసుకుంటున్నారు. నీటిస్థాయి తక్కువగా ఉన్నందున... శివారు ప్రాంతాలకు వారానికోసారి ట్యాంకర్లు వెళుతున్నాయి. ఆ నీళ్లు కూడా జనాభా సంఖ్యకు అనుగుణంగా లేకపోయేసరి ట్యాంకర్ల దగ్గర గొడవలు జరుగుతున్నాయి. ఒక్కోసారి ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి.

జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు తాగునీటి సరఫరా విభాగం, మున్సిపల్ అధికారులు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అయినా... చాలా ప్రాంతాల్లో కంటితుడుపుగానే చర్యలుంటున్నాయన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గ్రామీణ ప్రజలు పనులు మానుకుని ట్యాంకర్ల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆదోని, డోన్, పత్తికొండ, ఆలూరు పరిధిలో నీటి కష్టాలు వర్ణనాతీతంగా మారాయి.

తుంగభద్ర జలాశయం నుంచి నీటిని విడుదల చేయాలని కలెక్టర్ వీరపాండియన్ లేఖరాసి 15 రోజులైనా కర్నాటక ప్రభుత్వం ఇప్పటికీ స్పందించలేదు. శ్రీశైలం జలాశయానికి నీరుచేరితే హంద్రీనీవా, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాల ద్వారా నీటిని తీసుకునే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటిఎద్దడిపై టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని చెప్పారు. తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న రెండు వందల గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారంటే కర్నూలు జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details