కర్నూలు జిల్లా కోసిగి మండలంలో పలు గ్రామాల ప్రజలు కలుషిత నీరు తాగి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత రెండు రోజుల నుంచి జంపాపురం, సజ్జలగుడ్డం గ్రామానికి చెందిన దాదాపు 50 మంది కలుషిత నీరుతాగి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ప్రస్తుతం 40 మంది కోసిగిలో చికిత్స పొందుతున్నారు. మరో 10 మందికి పైగా అతిసార వ్యాధితో చికిత్స కోసం ఆదోని ప్రాంతీయ ఆసుపత్రిలో చేరారు.
ఇంతా జరుగుతున్నా ప్రభుత్వ అధికారులు గాని, వైద్య సిబ్బందిగాని తమ గ్రామాల వైపు కన్నెత్తి చూడడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్రామాల్లో ఎక్కడా కూడా పారిశుద్ధ్య పనులు చేపట్టడం లేదని.. నీటి ట్యాంకులు సైతం శుభ్రం చేయడం లేదని గ్రామస్థులు ఆరోపించారు. బాధితులను పరామర్శించిన మంత్రాలయం తెదేపా ఇంఛార్జ్ తిక్కారెడ్డి.. అధికారులు చర్యలు తీసుకోకపోతే కలెక్టర్ కార్యాలయం ముట్టడి చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు.