రాయలసీమ విశ్వవిద్యాలయ అభివృద్ధికి గ్రహణం పట్టింది. వర్సిటీలో పనులు ముందుకు సాగడం లేదు. విశ్వవిద్యాలయ పరిపాలన వ్యవహారాల పర్యవేక్షణలో ప్రధానమైన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (ఈసీ) సమావేశాలు జరిగిన దాఖలాలు లేవు. వీసీ పోస్టు మొదలుకుని రెక్టార్, రిజిస్ట్రార్ స్థానాలు ఇన్‌ఛార్జుల పాలనలో సాగుతున్నాయి. గత పది నెలల కాలంలో ప్రస్తుత ఉప కులపతి కేవలం రెండుసార్లు మాత్రమే వర్సిటీకి వచ్చారు. గ్రూపు రాజకీయాలు సమస్యలుగా మారాయి.
రాయలసీమ విశ్వవిద్యాలయం ఏర్పాటై దశాబ్దకాలం దాటినా ఇంకనూ ప్రాథమిక వసతులే కానరావడం లేదు. గత ప్రభుత్వ హయాంలో వర్సిటీ ఆవరణలో తరగతి గదులు, గ్రంథాలయ నిర్మాణాలకు కోట్లాది రూపాయల నిధులు మంజూరయ్యాయి. ప్రస్తుతం ఆ పనులు ముందుకు కదలడం లేదు. గడిచిన ఏడాదిన్నర కాలంలో పరిపాలన పరమైన వివిధ విషయాల్లో తీవ్ర ఆరోపణలు తప్పడం లేదు. వర్సిటీకి కీలకమైన ఉప కులపతి అందుబాటులో లేకపోవడంతో వర్సిటీ పాలన అంశాలను ఎవరూ పట్టించుకోవడం లేదు. గతంలోని ఉప కులపతి రాజీనామా చేయడంతో ఐఏఎస్ అధికారికి వర్సిటీ ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పజెప్పారు. ఆయన విధుల్లో చేరినప్పటి నుంచి నేటివరకు రెండుసార్లు మాత్రమే వచ్చి వెళ్లారు. రెక్టార్, రిజిస్ట్రార్లు సైతం ఇన్‌ఛార్జులే కావడంతో వర్సిటీలో కీలకమైన నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి నెలకొంది. ప్రతి విషయానికి ఉప కులపతిపై ఆధారపడి పనిచేయాల్సి వస్తోంది. ముగ్గురు అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ఆరు నెలలుగా వేతనాలను ఆపేశారు. ఆ సమస్యను ఎవరూ పట్టించుకోవడం లేదు.
పర్యవేక్షణ కరవు
వర్సిటీలో ప్రధానంగా పరీక్షలు, పరిపాలన, డెవలప్‌మెంట్, ఫైనాన్స్ అకడమిక్ విభాగాల్లో పర్యవేక్షణ కొరవడింది. గత రిజిస్ట్రార్ 2019 నవంబరు 15న రాజీనామా చేయగా.. 16వ తేదీన ఇన్‌ఛార్జిగా మరొకరిని నియమించారు. అదే నెల 17న ఉప కులపతి రాజీనామా చేయగా డిసెంబరు 13వ తేదీన ఇన్‌ఛార్జి వీసీగా ఎం.ఎం.నాయక్‌కు బాధ్యతలు ఇచ్చారు. మరోవైపు ఆర్థిక సంబంధాల విభాగం ద్వారా ఉద్యోగుల జీతభత్యాలు, కాంట్రాక్టు బిల్లులు, మెడికల్ రీఎంబర్సుమెంటు బిల్లులు సకాలంలో మంజూరు కావడం లేదు. కీలక స్థానాల్లో ఉన్న వారి మధ్య సఖ్యత లేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఆధిపత్య పోరులో భాగంగా రెండు వర్గాలుగా విడిపోవడం గమనార్హం.
పాలన అధ్వానం