అభివృద్ధి పేరుతో బస్ షెల్టర్లు కూల్చివేత.. కోట్ల రూపాయలు వృధా Demolition of bus shelters: రాష్ట్రంలో చాలాచోట్ల రోడ్లు పాడయ్యాయి. కాలువలు, డ్రైనేజీలు అస్తవ్యస్తంగా మారాయి. ఆస్పత్రుల్లో మౌలిక వసతుల్లేక రోగులు ఇబ్బంది పడుతున్నారు. వీటన్నింటినీ బాగు చేయకుండా అభివృద్ధి పేరిట విధ్వంసానికి తెరలేపింది జగన్ ప్రభుత్వం. సుందరీకరణ పేరుతో భవనాలకు వైఎస్సార్సీపీ రంగులు వేయటం.. చెట్లు పడగొట్టడం.. బాగున్నవాటిని కూల్చేసి.. కొత్త నిర్మాణాలు చేపట్టడం లాంటి చర్యలతో తరచూ విమర్శలు ఎదుర్కొంటోంది. తాజాగా కర్నూలు నగరంలో పునరుద్ధరణ పేరుతో బాగున్న బస్ షెల్టర్లను కూల్చేస్తూ కోట్ల ప్రజాధనాన్ని వృథా చేస్తోంది.
ఏ ప్రభుత్వమైనా ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తుంది. కానీ జగనన్న సర్కార్ మాత్రం అందుకు విరుద్ధం. కర్నూలు నగరంలో బస్ షెల్టర్ల కూల్చివేతే ఇందుకు నిదర్శనం. అభివృద్ధి పనుల పేరుతో బాగున్న బస్ షెల్టర్లనుకూల్చడమే పనిగా పెట్టుకుంది. ఉన్నవాటిని కూల్చి.. కొత్తగా 47 బస్ షెల్టర్లు నిర్మించేందుకు నగరపాలక సంస్థ స్టాండింగ్ కౌన్సిల్ సమావేశంలో తీర్మానం పెట్టి ఆమోదించారు. కొత్త వాటి నిర్మాణానికి టెండర్లు పిలవాలని నిర్ణయించారు. దీంతో ప్రయాణికులకు నీడనిచ్చే బస్ షెల్టర్లను కూల్చేస్తున్నారు.
రాత్రి వేళల్లో ఆశ్రయం పొందుతున్న అనాథలు, బిక్షగాళ్లకు చోటు కూడా లేకుండా నిర్ధాక్షిణ్యంగా పడగొట్టేస్తున్నారు. బస్ షెల్టర్లు చాలా దృఢంగా ఉన్నా బలవంతంగా గ్యాస్ కట్టర్లతో తొలగిస్తున్నారు. నగరపాలక సంస్థ చర్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల ఆస్తులను.. ఇష్టారాజ్యంగా కూల్చేస్తున్నారని పౌర సంక్షేమ సంఘం నాయకులు మండిపడుతున్నారు. దీనివల్ల సుమారు 4 కోట్ల రూపాయల వరకుప్రజాధనం దుర్వినియోగంఅవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినవారికి టెండర్లు కట్టబెట్టేందుకే ప్రజాధనాన్ని దోచేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఇలాంటి చర్యలు విరమించుకుని ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని కోరుతున్నారు.
కర్నూలు నగరంలో నేల విడిచి సాము చేసినట్లుగా.. అధికారులు, అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు వ్యవహరిస్తున్నారు.. గతంలో కట్టిన కట్టడాలను పడగొట్టడం మళ్లీ కట్టడం.. ఎలక్షన్ వస్తుండటంతో పట్టణంలో సుందరీకరణ పేరుతో ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారు. దాదాపు 4 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి కొత్తవి నిర్మించడానికి సన్నద్దమవుతున్నారు. అవసరం లేని అభివృద్ధి పనులు చేస్తూ ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు.- పుల్లారెడ్డి, పట్టణ పౌరసంక్షేమ సంఘం నాయకుడు
చాలా మంది మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగస్తులు వచ్చి ఈ బస్ షెల్టర్లో నిలబడుతుంటారు.. బస్ షెల్టర్లను బాగోలేదు కొత్తవి కట్టిస్తాము అని చెప్పి తొలిగిస్తున్నారు. ఉన్న వాటిని బాగు చేయాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులది.. ఈ రోజు మున్సిపాలిటీలో పనుల పేరు చెప్పి కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు.- నాగరాజు, పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకుడు