మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠానికి ఉత్తర ద్వారాన రంగ భవన్‌లో 3 కోట్ల రూపాయల వ్యయంతో దాస సాహిత్య మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. గతేడాది ఆగస్టులో పీఠాధిపతి సుబుదేంద్రతీర్థులు దీనిని ప్రారంభించారు. రాఘవేంద్ర స్వామి దర్శనానంతరం ఈ మ్యూజియాన్ని ఉచితంగా సందర్శించవచ్చు. దేశ ప్రాచీన భారతీయ విజ్ఞానాన్ని, సంస్కృతి, సంప్రదాయాన్ని తెలిపే చిత్రాలు, బొమ్మలు, విగ్రహాలు ఏర్పాటు చేశారు. వాటికింద తెలుగు, హిందీ, ఆంగ్లం, కన్నడ భాషల్లో వివరణ ఇచ్చారు. నిత్యం ఎంతో మంది భక్తులు ఈ ప్రదర్శనశాలను సందర్శిస్తుంటారు.ఇది తమకు ఎంతో విజ్ఞానదాయకంగా ఉందని భక్తులంటున్నారు.
మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో... దాస సాహిత్య మ్యూజియం - Mantralayam updates
జీవన ముక్తిని సూచించే మార్గాలు... నిత్యం ఆచరించే సంప్రదాయ పద్ధతులు తెలుపుతూ... విజ్ఞానం అందించే విధంగా ఓ ప్రదర్శనశాల ఏర్పాటైంది. తెల్లవారుజామున లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఆధ్యాత్మికంగా ఆచరించాల్సిన కార్యాలను తెలియజేసే... మ్యూజియం మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో అందుబాటులోకి వచ్చింది.
విజ్ఞాన పూర్ణములైన సృష్టి రహస్య వివరణ, యోగమార్గంలోని నాడీ చక్రాల చిత్రాలు, దివ్యలక్షణాలతో కూడిన విష్ణుపాదం బృహత్ ఫలకం ప్రదర్శనశాలలో దర్శనమిస్తాయి. అంతేకాకుండా రాఘవేంద్ర స్వామి తులసీ బృందావన ప్రతీక, వైకుంఠం, దేహమే దేవాలయంగా బోధించే చిత్రాలు, గోపాల కృష్ణుడి గోమాత ప్రతీక, కేశవుడి 24 రూపాల చిత్రాలు... తదితర వాటిని వివరించే 300లకు పైగా చిత్రాలున్నాయి. ఎంతో ప్రశాంత వాతావరణంలో ఇంత మంచి మ్యూజియాన్ని చూడటం తమకెంతో ఆనందగా ఉందని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఈ ప్రదర్శనశాల ద్వారా యువత.. సంస్కృతి, సంప్రదాయాలు, వాటి విధానాల గురించి.. తెలుసుకోవచ్చని... మంత్రాలయ మఠం భావిస్తోంది.
ఇదీ చదవండి:'శ్రీశైలం డ్యాం భద్రతకు పొంచి ఉన్న ముప్పు'.. కమిటీ తుది నివేదికలో వెల్లడి