కర్నూలు జిల్లా కొచ్చె రువు గ్రామమంటేనే అందరికీ గుర్తుకొచ్చేది ఉల్లి. ఇక్కడ 300 మంది రైతులు 500 ఎకరాల్లో ఉల్లి పంట సాగు చేశారు. వీరంతా కర్నూలు నుంచి ఈస్ట్ వెస్ట్ కంపెనీ విత్తనాలు తీసుకొచ్చి పంట వేశారు. పంట వేసినప్పటి నుంచి రెండు నెలల వరకు అంతా బాగానే ఉంది. పంట చేతికొచ్చే సమయంలో ఉల్లిపాయలకు పిలకలు, పంగలు వచ్చాయి. నకిలీ విత్తనాలతోనే నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో ఎకరాకు 200 క్వింటాళ్ల దిగుబడి వచ్చేదని, ప్రస్తుతం 30 క్వింటాళ్లు కూడా రాలేదని వాపోతున్నారు. అప్పులు చేసి పెట్టుబడులు పెడితే.. దిగుబడి రాకపోవడంతో అప్పులు తీర్చలేని పరిస్థితి ఏర్పడిందని దిగులు చెందుతున్నారు. పండిన పంటను కొనేందుకు కూడా వ్యాపారులు ముందుకు రావడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.