ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 30, 2020, 9:13 PM IST

ETV Bharat / state

కర్నూలు జిల్లాలో పంట అమ్మకాలకు పచ్చజెండా

కర్నూలు జిల్లాలో సుమారు రెండు నెలల అనంతరం రైతులు.. తమ పంటను అమ్ముకోవటానికి మార్గం సుగమం అయ్యింది. కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్లను తెరిచిన అధికారులు... వాటి ద్వారా పత్తి, ఆముదాలు, వేరుశెనగ, కందులను కొనుగోలు చేస్తున్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు పాటిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా మాస్కులు ధరించటం, శానిటైజ్ చేసుకోవటం, భౌతిక దూరం పాటించటం, థర్మల్ స్క్రీనింగ్ చేయడం వంటి జాగ్రత్తలు పాటిస్తున్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు మరింత గిట్టుబాటు ధరలు వస్తాయని... సీఏం యాప్ ద్వారా ఎంతో మేలు జరుగుతుందంటున్న జిల్లా మార్కెటింగ్ శాఖ ఏడీ సత్యనారాయణ చౌదరితో ప్రత్యేక ముఖాముఖి...

crop sales started  in Kurnool district
కర్నూలు జిల్లాలో పంట అమ్మకాలకు పచ్చజెండా

ఈటీవీ భారత్​: రెండు నెలల తరువాత కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు మార్కెట్లు తెరుచుకున్నాయి. మిగిలిన మార్కెట్ల పరిస్థితి ఎలా ఉంది? ఏయే పంటలు కొనుగోలు చేస్తున్నారు?

సత్యనారాయణ చౌదరి: కరోనా ప్రభావంతో రెండు నెలలుగా మార్కెట్ యార్డులు మూసివేశాం. వారం క్రితం ఎమ్మిగనూరు, ఆదోని మార్కెట్లు ప్రారంభించాం. మూడు రోజుల క్రితం కర్నూలు మార్కెట్ యార్డునూ ప్రారంభించాం. కర్నూలులో ఉల్లి మినహా మిగతా పంటల క్రయ విక్రయాలు మొదలయ్యాయి. యార్డులోకి ప్రవేశించే ముందు థర్మల్ స్కాన్ చేస్తున్నాం. శానిటైజర్​తో చేతులు శుభ్రం చేసుకున్న తర్వాత, మాస్క్ ఉంటేనే లోపలికి అనుమతిస్తున్నాం.

ఈటీవీ భారత్​: మిగతా మార్కెట్లలో పరిస్థితి ఎలా ఉంది?

సత్యనారాయణ చౌదరి: మే, జూన్ నెలల్లో కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరుల్లో మాత్రమే క్రయ విక్రయాలు జరుగుతాయి. పశువుల మార్కెట్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. వీటిపై త్వరలో నిర్ణయం తీసుకుంటాం. రైతు బజార్లను ఇప్పటికీ మూసే ఉంచాం. సంచార రైతు బజార్లు మాత్రమే వినియోగదారులకు సేవలందిస్తున్నాయి.

ఈటీవీ భారత్​: కర్నూలు మార్కెట్​లో ఉల్లిని ఎందుకు కొనుగోలు చేయటం లేదని రైతులు అడుగుతున్నారు?

సత్యనారాయణ చౌదరి: రబీలో ఉల్లి దిగుబడులు తక్కువగా ఉంటాయి. క్వింటా ఉల్లికి రూ. 770 చొప్పున మార్క్​ఫెడ్ ద్వారా 820 టన్నులు కొనుగోలు చేశాం. జూలై 15 తరువాత ఖరీఫ్ ఉల్లి వస్తుంది. ఆలోపు తగిన చర్యలు తీసుకుని ప్రభుత్వ ఆదేశాల మేరకు కొనుగోలు చేస్తాం.

ఈటీవీ భారత్​: ఆదోని మార్కెట్​కు పత్తి ఎక్కువగా వస్తుంది కదా..! ప్రస్తుతం ఎంతమేర పత్తి వస్తోంది? కొనుగోళ్లు ఎలా జరుగుతున్నాయి?

సత్యనారాయణ చౌదరి:ప్రస్తుతం 100 నుంచి 150 మంది రైతులు మార్కెట్​కు పత్తిని తీసుకువస్తున్నారు. కరోనా కంటే ముందే కాటన్ కార్పొరేషన్ కేంద్రాలు మూసివేశాం. ఇప్పుడు ఆ కేంద్రాలను తెరిచి 5 వేల క్వింటాళ్లను మద్దతు ధరతో కొనుగోలు చేశాం.

ఈటీవీ భారత్​: మార్కెట్లు తెరిచినట్లు రైతులకు తెలియదు కదా... దీని కోసం మీరేం చేస్తున్నారు?

సత్యనారాయణ చౌదరి: మార్కెట్లు తెరిచిన విషయాన్ని పత్రికలు, టీవీలు, వ్యాపారుల ద్వారా రైతులకు తెలియజేశాం. యార్డుకు వచ్చినప్పుడు కనీస జాగ్రత్తలు పాటించాలని అవగాహన కల్పించాం.

ఈటీవీ భారత్​: ఉల్లి క్రయ విక్రయాలు ఎప్పుడు జరుగుతాయి?

సత్యనారాయణ చౌదరి: లాక్​డౌన్ తీసేశాక కలెక్టర్​ను సంప్రదించి వివరాలు తెలుపుతాం. గ్రామీణ ప్రాంతాల్లో సీఎం యాప్ ద్వారా పంటల ధరలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటాం. రైతు భరోసా కేంద్రాల్లో పంట అమ్ముకోవచ్చు.

ఈటీవీ భారత్​: రైతు భరోసా కేంద్రాల్లో ఎప్పటినుంచి సరకులు అమ్ముకోవచ్చు ?

సత్యనారాయణ చౌదరి: రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇప్పటికే కందులు, శనగలు, పసుపు, మొక్కజొన్న కొనుగోళ్లు జరుగుతున్నాయి.

ఈటీవీ భారత్​: రైతులకు మీరిచ్చే సలహా ఏమిటి ?

సత్యనారాయణ చౌదరి:ప్రభుత్వ సేవలను రైతుల వద్దకు తీసుకెళ్లడానికి ముఖ్యమంత్రి.. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా రైతులు నష్టపోయే అవకాశం ఉండదు. పంట రవాణా ఖర్చులు తగ్గుతాయి. ఇవి ఎంతో మేలు చేస్తాయి.

ఇదీ చదవండి.

వాలంటీర్​ వేధింపులు.. మాజీ మంత్రి కారు డ్రైవర్​ ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details