నివర్ తుపాను రైతుల కష్టాన్ని నీటిపాలు చేసింది. కర్నూలు జిల్లాలో మొత్తం 15,788 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు. 479 హెక్టార్లలో ఉద్యాన పంటలు, 232 హెక్టార్లలో అరటి తోటలు పాడైనట్లు నివేదికలో స్పష్టం చేశారు. చాగలమరి, ఆళ్లగడ్డ మండలాలలో 3.4 కిలోమీటర్ల మేర రహదారులు, 34 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని తెలియజేశారు.
ఆళ్లగడ్డ నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల్లో వరద ప్రభావం ఉంటుందని కలెక్టర్ తెలిపారు. వర్షం తీవ్రత తగ్గకపోవటంతో వాగులు, వంకలు పొంగుతున్నాయన్నారు. ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కోవెలకుంట్ల, ప్యాపిలి మండలాల్లో పంట నష్టపోయిన రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.