TDP AND CPI LEADERS PRESS MEET: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సీపీఐ కలిసి అధికార పార్టీ వైసీపీని ఓడిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కర్నూలులో తెలిపారు. కర్నూలులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం, సీపీఐ నాయకులు సంయుక్తంగా కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రామగోపాల్ రెడ్డికి రెండవ ప్రాధాన్యత ఓటు వేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. అదే విధంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కత్తి నర్సింహారెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తున్నట్లు ఆయన తెలిపారు.
"రాష్ట్రానికి చాలా మంది ముఖ్యమంత్రులు వచ్చారు. చంద్రబాబు నాయుడు కూడా దీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ ఏ ముఖ్యమంత్రి కూడా పట్టుభద్రుల నియోజకవర్గంలో, అలాగే టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జోక్యం చేసుకోలేదు. మొట్టమొదటిసారి జగన్ మోహన్ రెడ్డి అక్రమంగా సంపాదించిన డబ్బుతో దొంగ ఓట్లు సృష్టిస్తున్నారు. రాష్ట్రంలో కేవలం తమ మాట మాత్రమే గెలవాలనే ఉద్దేశంతో ప్రతిపక్షాల గొంతు నొక్కాలని ఇలాంటి పద్ధతులకు పాల్పడుతున్నారు. దొంగ ఓట్లు సృష్టించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. వైసీపీని ఓడించాలన్న ఉద్దేశంతో మేమంతా ఏకమైయ్యాము. మొదటి ప్రాధాన్యత ఓటును పీడీఎఫ్ అభ్యర్థికి, రెండో ప్రాధాన్యత ఓటును టీడీపీ అభ్యర్థికి వేస్తాం"-రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి