ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అభయమేదీ!.. కొవిడ్‌ ఆస్పత్రుల్లో అడుగడుగునా లోపాలు - కర్నూలు కొవిడ్‌ ఆస్పత్రుల్లో అడుగడుగునా లోపాలు

విజయవాడలోని కొవిడ్‌ కేర్‌ సెంటరులో ఆదివారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో పలువురు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కర్నూలు జిల్లావ్యాప్తంగా ఉన్న ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులను సైతం ఉలిక్కిపాటుకు గురిచేసింది. భద్రత ప్రమాణాలు లేకున్నా.. కనీస జాగ్రత్త చర్యలు కానరాకపోయినా అధికారులు మాత్రం అనుమతులు మంజూరు చేసేస్తున్నారు. రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.

covid hospitcovid hospitalsals
covid hospitcovid hospitalsals

By

Published : Aug 10, 2020, 11:37 AM IST

కర్నూలు జిల్లాలో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే 27 వేల మందికిపైగా బాధితులు ఉన్నారు. ఈ నేపథ్యంలో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి, మెడికవర్‌, అమీలియో, గౌరీగోపాల్‌, ఒమినీ, విశ్వభారతి, నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి, శాంతిరాం, ఆదోని ప్రభుత్వ తదితర వైద్యాలయాలను కొవిడ్‌ ఆసుపత్రులుగా జిల్లా అధికారులు గుర్తించారు. వీటిల్లో 3 వేల మంది వరకు చికిత్స పొందుతున్నారు. ఇవికాక కర్నూలు, నంద్యాల తదితర ప్రాంతాల్లోని టిడ్కో బహుళ అంతస్తుల సముదాయాలను సైతం క్వారంటైన్‌ కేంద్రాలుగా మార్చి బాధితులకు వైద్యం అందిస్తున్నారు. కరోనా రోగులకు వైద్యసేవలు అందించేందుకుగాను ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు కేటాయించింది.

  • అడుగడుగునా లోపాలే

భద్రతాపరంగా ప్రైవేటు ఆసుపత్రులను గమనిస్తే ఎన్నో లోపాలు కనిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం అన్ని అర్హతలుంటేనే కొవిడ్‌ ఆస్పత్రులుగా గుర్తించాల్సి ఉంది. అధికారులు వాటిని ఏమాత్రం పట్టించుకోకుండానే హడావుడిగా అనుమతులు ఇచ్చేశారు. మరోవైపు అగ్నిమాపకశాఖ నుంచి నిరభ్యంతర పత్రం తీసుకోని వాటిని సైతం కొవిడ్‌-19 ఆసుపత్రులుగా మార్చడం గమనార్హం. చాలా వాటిల్లో అగ్నిమాపక పరికరాలు లేవు. కొన్నింటిలో ఉన్నా 24 గంటలపాటు అప్రమత్తంగా ఉండి ప్రమాదాన్ని నివారించే సుశిక్షితులైన సిబ్బంది లేరు. పొగ వెలువడిన వెంటనే పసిగట్టి సైరన్‌ ద్వారా అప్రమత్తం చేసే ఆటోమేటిక్‌ స్మోక్‌ డిటెక్టర్‌ సిస్టం సైతం లేదు. ప్రధానంగా బహుళ అంతస్తు భవనాల్లో నిర్వహించే ఆసుపత్రులకు ర్యాంపులు తప్పనిసరిగా ఉండాలి. అచేతన స్థితిలో ఉన్న రోగులను స్ట్రెచర్‌ లేదా చక్రాల కుర్చీలో మెట్ల మీదుగా బయటకు తీసుకురావాలంటే కష్టసాధ్యమే. ర్యాంపులు ఉన్నట్లయితే సులువుగా.. సురక్షితంగా బయటకు తరలించేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం కొవిడ్‌ ఆస్పత్రులుగా గుర్తింపు పొందిన కొన్నింటిలో ర్యాంపు సౌకర్యం లేకపోవటం ప్రధాన లోపం. విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్‌లో ర్యాంపులు లేకపోవటంతో రోగులకు బయటకు తీసుకురాలేకపోయారు. ఫలితంగా చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో అధికారులు ఇకనైనా పూర్తిస్థాయిలో తనిఖీలు చేయాల్సి ఉంది.

  • వసతులు ఎలా ఉండాలంటే..

ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాల ప్రకారం ఆసుపత్రి చుట్టూ అగ్నిమాపక వాహనం తిరిగేందుకు విశాలమైన ఖాళీ స్థలం ఉండాలి. భవనం ఎత్తు 9 మీటర్లలోపు ఉంటే రెండు మీటర్ల వెడల్పుతో మెట్లు లేదా ర్యాంపు ఉండాలి. 9 మీటర్ల నుంచి 15 మీటర్ల వరకు ఉంటే మెట్లతోపాటు ర్యాంపు తప్పనిసరి. 15 మీటర్లు దాటితే ర్యాంపుతోపాటు లోపలిలైపు.. బయటవైపు మెట్లు ఏర్పాటు చేయాలి. భవనంపైన 20 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన నీళ్ల ట్యాంకు, భవనం కింద లక్ష లీటర్ల నీళ్ల ట్యాంకు, 1,620 ఎల్‌పీఎం పంపుసెట్లు ఉండాలి. స్పింక్లర్లు, స్మోక్‌ డిటెక్టర్లు ఇతరత్రా ఉపకరణాలు తప్పనిసరిగా ఉండాలి. నిబంధనల ప్రకారం ఇవన్నీ ఉన్న ఆసుపత్రులకే అగ్నిమాపకశాఖ నిరభ్యంతర పత్రం ఇవ్వాల్సి ఉంటుంది.

తనిఖీలు చేస్తున్నాం

విజయవాడ ఘటన నేపథ్యంలో కలెక్టర్‌ ఆదేశాలమేరకు కొవిడ్‌ ఆసుపత్రులు తనిఖీ చేస్తున్నాం. ఎన్‌వోసీ లేని, భఫద్రత లోపాలున్న ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటాం. జిల్లాలో ప్రైవేటు హోటళ్లలో కొవిడ్‌ కేర్‌ సెంటర్లు నిర్వహిస్తున్నట్లు మా దృష్టికి రాలేదు. - శ్రీనివాసరెడ్డి, జిల్లా విపత్తు స్పందన అగ్నిమాపకశాఖ అధికారి​​​​​​​

ఇదీ చదవండి:కరోనా ఉగ్రరూపం: ఒక్కరోజులో 1,007 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details