కర్నూలు జిల్లాలోని ఆదోని కేడీసీసీ బ్యాంకులో నకిలీ బంగారం కలకలం రేపింది. బ్యాంకులో తనఖా పెట్టిన బంగారు ఆభరణాలకు బదులుగా నకిలీ అంటగట్టారని ప్రమోద్ కుమార్ అనే యువకుడు ఆరోపించాడు. అయితే తమకేమీ సంబంధం లేదని బ్యాంకు అధికారులు చెబుతున్నారు.
FAKE GOLD: ఆదోని కేడీసీసీ బ్యాంకులో నకిలీ బంగారం కలకలం..ఏమైంది? - Adoni updates
కర్నూలు జిల్లా ఆదోని కేడీసీసీ బ్యాంకులో నకిలీ బంగారం కలకలం రేపింది. రెండేళ్ల క్రితం బ్యాంకులో తనఖా పెట్టిన బంగారు ఆభరణాలకు బదులుగా నకిలీ అంటగట్టారని ఆరోపిస్తూ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరోవైపు తమకు ఎలాంటి సంబంధం లేదని బ్యాంకు అధికారులు తెలిపారు.
స్థానిక అంబేడ్కర్ నగర్‌లో నివాసం ఉంటున్న తిరుపతి ప్రమోద్‌కుమార్ 2019 డిసెంబరు 11న 35.81 తులాల బంగారు ఆభరణాలు బ్యాంకులో తనఖా పెట్టి రూ.4,98,600 రుణం తీసుకున్నారు. అనంతరం అతను రుణం సరిగా చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు పలుమార్లు నోటీసులు జారీచేశారు. తన బావ రమేశ్‌తో కలిసి గురువారం బ్యాంకుకు వెళ్లిన అతను వడ్డీతో కలిసి రూ.6,02,401 చెల్లించారు. బ్యాంకర్లు మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఆభరణాలు తన చేతికి ఇచ్చారని, వాటిపై అనుమానం వచ్చి నేరుగా షరాఫ్ బజారుకు వెళ్లి తనిఖీ చేయించగా నకలీగా తేలిందని ప్రమోద్ కుమార్ తెలిపారు. అనంతరం బ్యాంకు అధికారులను సంప్రదించగా తమకు సంబంధం లేదని చెబుతున్నారని వాపోయారు.
బ్యాంకు మేనేజరు మహబూబ్ బాషా వివరణ కోరగా నగలను సరిచూసుకున్నాక ఖాతాదారు పుస్తకంలో సంతకం చేసి వెళ్లారని, మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో బ్యాంకుకు తిరిగి వచ్చి ఫిర్యాదు చేశారని, ఈ విషయంలో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఎటూ తేలకపోవడంతో రాత్రి 8 గంటల ప్రాంతంలో పంచాయితీ రెండో పట్టణ పోలీసు స్టేషన్‌కు చేరింది. ఈ వ్యవహరం వెనుక ఎవరెవరి హస్తం ఉందనేది పోలీసులే తేల్చాల్సి ఉంది.
ఇదీ చదవండి