మే 05 నాటికి 516 పాజిటివ్ కేసులు...
జిల్లాలో మార్చి 28వ తేదీన మొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదు కాగా... ఏప్రిల్ 5నాటికి ఈ సంఖ్య 56కు చేరింది. ఏప్రిల్ 18వ తేదీ నాటికి 132 కొవిడ్-19 కేసులు నమోదయ్యాయి. మరో 12 రోజుల్లోనే ఏకంగా 254 పాజిటివ్ కేసుల నమోదుతో.. ఏప్రిల్ 30 నాటికి కరోనా కేసుల సంఖ్య 386కు చేరింది.
మే ఒకటో తేదీ నుంచి కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఒకటిన 25, రెండోతేదీ 25, మూడో తేదీ 30, నాలుగో తేదీ 25, నేడు 25 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు జిల్లాలో 516 మందికి కరోనా సోకినట్లు ప్రభుత్వం తెలిపింది. కరోనా నుంచి కోలుకుని 114 మంది డిశ్ఛార్జ్ కాగా... 10 మంది మృతి చెందారు. మిగిలిన 392 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఆగమేఘాల మీద కరోనా గుర్తింపు చర్యలు...
కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించిన వెంటనే అధికారులు రంగంలోకి దిగారు. విదేశాల నుంచి వచ్చినవారిని గుర్తించి హోం క్వారంటైన్ లో ఉంచారు. సంజామల మండలంలో రైల్వే పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న రాజస్థాన్‌కు చెందిన యువకుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దిల్లీలోని మర్కజ్‌కు వెళ్లి వచ్చిన సుమారు 400 మందిని ప్రభుత్వ క్వారంటైన్లకు తరలించి... పరీక్షలు నిర్వహించారు. వీరిలో సుమారు 75 మందికి కరోనా ఉన్నట్లు తేలింది.
పాజిటివ్ రోగుల కుటుంబసభ్యులు, బంధువులను క్వారంటైన్లకు తరలించి పరీక్షలు నిర్వహించగా... మరికొందరికి కరోనా నిర్ధారణ అయ్యింది.