ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా కాఠిన్యం.. కుటుంబాల్లో విషాదం - కోరనా కాఠిన్యంపై వార్తలు

కరోనా మహమ్మారి మరింత కాఠిన్యాన్ని చూపుతోంది. కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. పండంటి కాపురాలు కకావికలమవుతున్నాయి. చాలాచోట్ల అనుమానాలే పెనుభూతాలవుతున్నాయి. వారిని ఊపిరి తీసుకోకుండా చేస్తున్నాయి. ఇంటి పెద్ద, ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాల రోదన వర్ణనాతీతం. రాష్ట్రంలో ఆదివారం వెలుగుచూసిన ఈ హృదయ విదారక ఘటనలు ప్రతి ఒక్కరిని కదిలిస్తున్నాయి. రోగులు, కుటుంబీకులు ఆత్మవిశ్వాసాన్ని, మనోధైర్యాన్ని పెంచుకోవాల్సిన ఆవశ్యకతను చాటి చెబుతున్నాయి.

corona difficulties in families
కరోనా కాఠిన్యం

By

Published : Jul 27, 2020, 7:04 AM IST

Updated : Jul 27, 2020, 3:18 PM IST

కర్నూలు జిల్లా ఆత్మకూరుకు చెందిన కార్పెంటర్‌ షఫివుల్లా (45) ఈ నెల 22న పరీక్షల కోసం నమూనాలనిచ్చారు. ఫలితం రాకముందే మానసిక సంఘర్షణకు లోనై మరుసటి రోజు ఇంటినుంచి వెళ్లి శివారులోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఫలితాల్లో నెగెటివ్‌ వచ్చిందని ఆయన భార్య ఆయేషాబీ రోదిస్తున్నారు.

ఇదే జిల్లాలోని నందికొట్కూరులో 22న సంజీవని వాహనం ద్వారా కొందరి నమూనాలను సేకరించారు. ఈ పరీక్ష చేయించుకున్న ఓ యువతికి పాజిటివ్‌ వచ్చిందని 25న సమాచారం అందింది. దీంతో 26న జరగాల్సిన ఆమె పెళ్లి నిలిచింది. యువతికి కరోనా లక్షణాలు కనిపించకపోవడంతో ఆమె తండ్రి కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి ఆదివారం మళ్లీ తీసుకెళ్లి పరీక్ష చేయించారు. నెగెటివ్‌ వచ్చింది. మొదట వచ్చిన తప్పుడు ఫలితాల వల్ల పెళ్లి నిలిచిందని ఆయన వాపోతున్నారు.

ఫలితం విన్నారు.. ప్రాణం వదిలారు

చిత్తూరు జిల్లాలోని సదుం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి(52) మూత్రనాళ సమస్యతో ఈనెల 23న తిరుపతి స్విమ్స్‌కు వెళ్లారు. అతడికి కరోనా పరీక్షలనూ చేశారు. పాజిటివ్‌ వచ్చిందని సిబ్బంది ఆదివారం ఉదయం ఇంటికెళ్లి తెలిపారు. కొంతసేపటికే తీవ్ర ఆందోళనకు గురైన ఆయన ఇంట్లోనే కుప్పకూలి చనిపోయారు.

భర్త మృతితో భార్య బలవన్మరణం

భర్త కరోనాతో మృతి చెందారనే మనోవేదనతో భార్య కన్నుమూశారు. ఈ విషాదం పశ్చిమగోదావరి జిల్లాలో ఆదివారం చోటు చేసుకుంది. భర్త మృతి చెందారని ఆమె 3 రోజులుగా తిండీ నిద్రా మానేసి అదే దిగులుతో చనిపోయారు.

బంధువులకు సోకిందన్న భయంతో..

కరోనా భయంతో గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు ఏల్లపు శ్యాంకుమార్‌ (23) బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆయన సమీప బంధువు ఏఎన్‌ఎంగా పనిచేస్తున్నారు. ఆమెకు, భర్తకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వారి ఇంట్లో పనికి తమ కుమారుడు వెళ్లారని తండ్రి శ్రీనివాసరావు పోలీసుల దృష్టికి తెచ్చారు. వార్డు వాలంటీరు సూచనల మేరకు 25న ఎయిమ్స్‌కు వెళ్లి పరీక్ష చేయించుకున్నామన్నారు. ఇంటికి తిరిగొచ్చాక కరోనా వస్తుందనే అనుమానం, భయంతో ఇంట్లో తన కుమారుడు ఉరేసుకున్నాడని తెలిపారు.

ఇంటి యజమాని బయటకు పంపాడు

కరోనా వచ్చిందనే కారణంతో అద్దెకున్న యువకుడిని ఇంటి యజమాని బయటకు పంపారు. ఈ ఘటన అనంతపురం జిల్లా ధర్మవరంలో చోటుచేసుకుంది. అనంతపురానికి చెందిన యువకుడు ధర్మవరంలో ఒక సంస్థలో పనిచేస్తూ సాయినగర్‌లో అద్దెకుంటున్నారు. పరీక్షలు చేయించుకున్న యువకుడికి పాజిటివ్‌ రావడంతో విషయాన్ని ఇంటి యజమానికి తెలిపారు. కనికరం కూడా చూపకుండా తక్షణం బయటకు వెళ్లాలని ఆయన చెప్పారు. యువకుడు కాలినడకన సరాసరి ప్రభుత్వాసుపత్రికి వెళ్లి ఐసొలేషన్‌ వార్డులో చేరారు.

తానొక్కరే ఎందుకని?

కన్న కొడుకును కరోనా బలితీసుకుంది. బంధువులు దూరమయ్యారు. ఈ ఆవేదనను తట్టుకోలేని వృద్ధురాలు కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన కృష్ణా జిల్లా నాగాయలంకలో చోటుచేసుకుంది. నాగాయలంక 11వ వార్డుకు చెందిన తలశిల హైమావతి (62), బసవ కుటుంబరావు దంపతులది వ్యవసాయ కుటుంబం. వారికి ఇద్దరు కుమారులు. కుటుంబరావు పదేళ్ల క్రితం చనిపోయాడు. పెద్ద కుమారుడు డ్రైవరు. చెన్నై వెళ్లి తప్పిపోయాడు. చిన్న కుమారుడు చిరు వ్యాపారి. అతనికి కరోనా సోకి చికిత్స పొందుతూ 23న చనిపోయారు. దహన సంస్కారాలకు బంధువులు రాకపోవడంతో ఎస్సై చల్లా కృష్ణ చొరవతో స్వచ్ఛంద సంస్థ ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసింది. ఈ ఘటనతో ఆ తల్లి హృదయం తల్లడిల్లింది. ఆమె కోడలికి పాజిటివ్‌ రావడంతో విజయవాడలోని క్వారంటైన్‌ కేంద్రానికి పంపారు. భర్త, ఒకరి వెంట ఒకరు ఇద్దరు కుమారులు దూరం కావడంతో ఆదివారం కృష్ణానదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మృతదేహాన్ని నాగాయలంక మండలంలోని టి.కొత్తపాలెం శివారు మరియాపురంలో నదీతీరాన గుర్తించారు. హైమావతి మృతదేహం వద్దకు కూడా బంధువులు రాకపోవడంతో దహన సంస్కారాలు చేసేందుకు నాగాయలంక పోలీసులు సిద్ధమయ్యారు.

ఇదీ చదవండి:కష్టమంటే చాలు.. ఇంట్లో మనిషైపోతున్నాడు సోనూసూద్

Last Updated : Jul 27, 2020, 3:18 PM IST

ABOUT THE AUTHOR

...view details