రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ ఒక్కసారిగా ఉద్ధృతరూపం దాల్చింది. ఒక్కరోజే 52 కొత్త కేసులు నమోదయ్యాయి. శనివారం రాత్రి వరకు ఇక్కడ 4 కేసులే ఉండగా, ఆదివారం సాయంత్రానికి ఆ సంఖ్య 56కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం అత్యధిక కేసులు కర్నూలు జిల్లాలోనే ఉన్నాయి. ఒక్కసారిగా ఇంత పెద్దమొత్తంలో కేసులు వెలుగుచూడటం జిల్లా వాసుల్లో ఆందోళన కలిగించింది. రాష్ట్రంలో శనివారం రాత్రి 9 గంటల నుంచి ఆదివారం సాయంత్రం వరకు 68 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 258కి చేరింది. రాష్ట్రప్రభుత్వం ఆదివారం సాయంత్రం 6 గంటలకు విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో ఇంతవరకు కరోనా సోకినవారిలో ఐదుగురు కోలుకుని ఇళ్లకు వెళ్లారు. వారిలో తూర్పుగోదావరి, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం, విశాఖ జిల్లాలవారు ఒక్కొక్కరి చొప్పున ఉన్నారు.
- రాష్ట్రంలో శనివారం రాత్రి వరకు 194 కరోనా కేసులు నమోదయ్యాయి. కృష్ణాజిల్లాలో 32 కేసులు నమోదైనట్టుగా మొదట పేర్కొన్న ప్రభుత్వం, ఆదివారం ఉదయం విడుదల చేసిన బులెటిన్‌లో ఆ సంఖ్యను 28కి తగ్గించింది. దీంతో శనివారం రాత్రి వరకు నమోదైన కేసుల సంఖ్య 190కి తగ్గినట్లయింది.
- శనివారం రాత్రి 9 నుంచి ఆదివారం ఉదయం 9 వరకు 36 కొత్త కేసులు, ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు మరో 29 కేసులు నమోదయ్యాయి.
- అనంతపురం జిల్లాలో ఆదివారం మూడు కేసులు నమోదైనట్లు ఆ జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఒక ప్రకటనలో తెలిపారు. కొత్తగా పాజిటివ్‌గా తేలిన ముగ్గురు హిందూపురం వాసులే. వీరిలో ఇద్దరికి గతంలో వైరస్ సోకినవారితో సంబంధం ఉందన్నారు. జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 6కు చేరింది.
- రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల్లో విదేశాల నుంచి వచ్చినవారు 11 మంది, వారికి సన్నిహితంగా మెలిగిన వారు ఆరుగురు, ఇతరులు ఆరుగురు ఉన్నారు. మిగతావారు దిల్లీలో జరిగిన మతపరమైన కార్యక్రమంలో పాల్గొన్నవారు, వారికి సన్నిహితంగా ఉన్నవారు.
- కర్నూలు తర్వాత అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 34 కేసులున్నాయి. 30 కేసులతో గుంటూరు మూడోస్థానంలో ఉంది. ఒక్కరోజే కర్నూలు జిల్లాలో 52 కేసులు
అత్యధిక కేసులు ఇలా..