కర్నూలు జిల్లాలో నగరంతోపాటు ఎమ్మిగనూరు, ఆదోని, నంద్యాల, డోన్, ఆత్మకూరు, గూడూరు, ఆళ్లగడ్డ తదితర ప్రాంతాల్లో 12 వేల వరకు కొత్త ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలో 50 వేల మందికిపైగా కూలీలకు ఉపాధి కరవైంది. దీంతో పూట గడవని పరిస్థితి ఏర్పడిందని కూలీలు వాపోతున్నారు. ప్రస్తుతం కర్ఫ్యూ నేపథ్యంలో చాలావరకు దుకాణాలు మూతపడుతున్నాయి. దీనికితోడు రవాణా వాహనాలు సైతం సరిగా రాకపోవడంతో సరకుకు కొరత ఏర్పడుతోంది. ఇదే అదునుగా కొందరు విపరీతంగా ధరలు పెంచేసి సొమ్ము చేసుకుంటున్నారు.
- అందరికీ భారమాయె
ప్రైవేటు కంపెనీలకు ఈనెల నుంచి ప్రభుత్వం ఇసుక రేవులను అప్పగించింది. నేరుగా టన్నుకు రూ.475 చెల్లించి కొనుగోలు చేసుకోవాలని ప్రభుత్వం ధర నిర్ణయించింది. గుడికంబాలి, నాగలదిన్నె, ఈర్లదిన్నె, కర్నూలు, నంద్యాల పరిధిలో ఈ రీచ్‌లు ఉన్నాయి. అంతేకాక వారం రోజుల నుంచి గతంలో లారీలకు పనులు లేకపోవడంతో దాదాపు 300కు పైగా టిప్పర్లు నిలిచిపోయాయి. డ్రైవర్లు, ఇతర యజమానులకు ఇంటి నిర్వహణ భారమైంది. నూతన పాలసీ విధానం వచ్చినా.. సరైన అవగాహన లేకపోవడంతో పనులు మొదలు కాలేదు. ఎమ్మిగనూరు, ఆదోని, కర్నూలు, కోడుమూరు ప్రాంతాలకు వెళ్లాలంటే పెరిగిన ధరలతో టిప్పర్ ఇసుక టన్నుకు రూ.1,300 (బాడుగ కలుపుకొని) వసూలు చేస్తున్నారు. దీంతోపాటు సామాన్యులకు సైతం ఇసుక ధర పూర్తిగా భారమైంది. దీంతో సొంతిళ్లు పునాదిలోనే నిలిచిపోయే పరిస్థితి నెలకొంది. జిల్లాలో కర్ఫ్యూను ప్రకటించడంతో ఉదయం 12 గంటల వరకు మాత్రమే దుకాణాలకు సమయం కేటాయించారు. వ్యాపారాలు బాగా జరుగుతున్నా సరకుల ధరలను మాత్రం పెంచి జనంపై భారం మోపుతున్నారు. ఏప్రిల్ 30వ తేదీన సిమెంటు ధర రూ.320 ఉండగా ప్రస్తుతం రూ.380కు పెంచేశారు. ఇనుము కిలో రూ.59 ఉండగా ఇప్పుడు ఏకంగా రూ.64.50కు పెంచేయడం గమనార్హం.
ఇష్టానుసారంగా పెంచేశారు
సొంతిల్లు కట్టుకోవాలన్నదే నా కల. మార్చిలో పనులు ప్రారంభించా. కర్ఫ్యూ నేపథ్యంలో సిమెంటు ధర పెంచేశారు. ముడి సరకుల ధర ఆకాశాన్ని అంటుతోంది. ఒకేసారి బస్తా సిమెంట్ రూ.60కు పైగా పెంచేశారు. ఇసుక దొరకడమే కష్టమైంది. కొత్త పాలసీతో కనీసం ఎవరిని సంప్రదించాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. అధికారులు సైతం తగిన చర్యలు చేపట్టడం లేదు.- ఫకృద్దీన్, ఎమ్మిగనూరు
పై అంతస్తు కట్టుకోవాలనుకున్నా
ఇళ్లు చిన్నగా ఉండడంతో పైఅంతస్తు చేపట్టాలని అన్నీ సిద్ధం చేసుకున్నాం. పెరిగిన సిమెంటు, ఇసుక ధరలతో ఒకసారి పనులు ప్రారంభించి వదిలేశా. ప్రస్తుతం ఐరన్ ధర విపరీతంగా పెరిగిపోయింది. వ్యాపారులు ఇష్టానుసారంగా పెంచేశారు. ఇదేమిటని ప్రశ్నిస్తే కర్ఫ్యూ కారణంగా సరకు సరిగా రావడం లేదని పేర్కొంటున్నారు.- తాయప్ప, ఎమ్మిగనూరు