Integrated Renewable Energy Storage Project: రాష్ట్రంలో చేపడుతున్న సమీకృత పునరుత్పాదక శక్తి నిల్వ ప్రాజెక్టు (ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ స్టోరేజ్ - ఐఆర్‌ఈఎస్‌పీ) భవిష్యత్తులో యావత్ దేశానికి మార్గదర్శకం కానుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. మంగళవారం కర్నూలు జిల్లా ఓర్వకల్లు పరిధిలోని గుమ్మటం తండా వద్ద గ్రీన్‌కో సంస్థ 5,230 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తికి రూ.30,000 కోట్లతో చేపడుతున్న ఐఆర్‌ఈఎస్ ప్రాజెక్టు పైలాన్‌ను ఆయన ఆవిష్కరించి నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. కర్నూలు జిల్లాలో ప్రపంచంలోనే అతి పెద్దదైన ఇలాంటి ప్రాజెక్టు ఏర్పాటుకు ముందుకొచ్చిన గ్రీన్ కో సంస్థకు అభినందలు తెలిపారు.
ముందుముందు విద్యుదుత్పత్తి రంగంలో శిలాజ ఇంధనాల బదులు పునరుత్పాదకశక్తి ఇంధన విభాగమే ముందంజలో నిలవనుందన్నారు. పర్యావరణహిత విద్యుదుత్పత్తి (గ్రీన్ పవర్) రంగంలో ఆసక్తి ఉన్న సంస్థలకు ఆంధ్రప్రదేశ్‌లో దేశంలో ఎక్కడా లేని విధంగా రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఇక్కడి భౌగోళిక పరిస్థితులు ఇలాంటి ప్రాజెక్టుల ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో సానుకూల వాతావరణం, సదుపాయాలవల్ల 33,000 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తికి అవకాశం ఉందని తెలిపారు. గ్రీన్ పవర్ ఉత్పత్తి విషయంలో దేశానికి ఈ ప్రాజెక్టు ఆదర్శంగా నిలుస్తుందని కితాబిచ్చారు.
మిత్తల్ కంపెనీ ఒప్పందం :ఈ ప్రాజెక్టువల్ల ఒకేచోట జల, పవన, సౌర విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని సీఎం జగన్ తెలిపారు. సౌర, పవన విద్యుత్తును ఉపయోగించి నీటిని ఎగువ జలాశయంలోకి పంపి, డిమాండ్ ఎక్కువగా ఉన్న సమయంలో ఆ నీటిని దిగువకు వదిలి విద్యుత్తు ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. తద్వారా రోజంతా విద్యుత్తు ఉత్పత్తి చేయడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకతని తెలిపారు. కాలుష్య రహితం, పర్యావరణ సమతుల్యత ఇక్కడ చాలా కీలకమైన అంశమన్నారు. మిత్తల్ కంపెనీ ఈ ప్రాజెక్టుతో వ్యాపార ఒప్పందం చేసుకుందని వివరించారు. ఆ సంస్థ ఇక్కడ 250 మెగావాట్ల విద్యుత్ ఉపయోగించి 1,000 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్తును ఉత్పత్తి చేస్తుందని, తద్వారా నిర్దేశించిన ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలకు లోటు లేకుండా కచ్చితంగా 250 మెగావాట్ల విద్యుత్‌ను కర్నూలు నుంచి సరఫరా చేస్తారని చెప్పారు. రానున్న రోజుల్లో ఇది ఒక వినూత్న ఒరవడికి శ్రీకారం చుట్టనుందన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 23,000 మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు.