ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉచిత రేషన్‌ నిలిపివేత.. ప్రజలపై పెరుగుతున్న భారం

కొవిడ్‌ నేపథ్యంలో పేదలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏప్రిల్‌ నుంచి నెలకు రెండు సార్లు ఇస్తున్న ఉచిత రేషన్‌ పంపిణీ నవంబరుతో ముగిసిపోయింది. డిసెంబరు నుంచి గతంలో లాగే నెలకు ఒక్క కోటానే ఇవ్వనున్నారు. అంతేకాకుండా బియ్యం మినహా కందిపప్పు, పంచదార ధరలు పెంచుతూ ఈ మేరకు డీడీలు చెల్లించాల్సిందిగా పౌరసరఫరాల శాఖ చౌకదుకాణదారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో కర్నూలు జిల్లాలోని లక్షల కుటుంబాలపై భారం పడనుంది.

ration items
పెరిగిన రేషన్​ వస్తువుల ధరలు

By

Published : Dec 1, 2020, 10:16 AM IST

పౌరసరఫరాల శాఖ అందించే రేషన్​ వస్తువులపై ధరలు పెంచుతూ డీడీలు చెల్లించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. చౌకదుకాణాల ద్వారా ఉచితానికి ముందు కిలో కందిపప్పు ధర రూ.40 ఉండగా, డిసెంబరు నుంచి రూ.67 పెంచుతూ ఆదేశాలు అందాయి. పంచదార ధర అరకిలో ప్యాకెట్‌ రూ.10 నుంచి రూ.17కు పెంచారు. దీంతో కర్నూలు జిల్లాలో 12.40 లక్షల రేషన్‌ కార్డుదారుల కుటుంబాలపై భారం పడనుంది. ఈ మేరకు ప్రతి కార్డుదారుడు నెలకు రూ.34 అదనంగా చెల్లించాల్సి ఉంది. కార్డుదారులకు ప్రతి కుటుంబ సభ్యునికి ఐదు కిలోల బియ్యంతో పాటు కార్డుకు కిలో కందిపప్పు ఇస్తున్నారు. డిసెంబర్‌ నుంచి కిలో కందిపప్పు రూ.67, అరకిలో పంచదారపై రూ.17 కార్డుదారులు చెల్లించాల్సి ఉంటుంది. జిల్లాలో నెలకు రూ.4.21 కోట్ల మేర భారం మోయాల్సిందే. చక్కెర, కంది బ్యాళ్లపై పెంచిన ధరల కారణంగా జిల్లాలో ఏడాదికి రూ.50 కోట్ల మేర అదనపు భారం పడనుంది.

ముందుకురాని డీలర్లు

జిల్లాలో 2,436 మంది చౌకదుకాణదారులున్నారు. ప్రతి డీలరు కంది పప్పునకు కిలోకు రూ.66 చెల్లించి, రూ.67కు విక్రయించాలి. అలాగే పంచదారకు కిలోకు రూ.33 చెల్లించి కిలో రూ.34కు విక్రయించాలి. ఇప్పటి దాకా తమకు చెల్లించాల్సిన కమీషన్లు ప్రభుత్వం చెల్లించక పోగా ప్రస్తుతం ఈ సరకులకు పెట్టుబడి ఎలా అన్న సందిగ్ధంలో డీలర్లు డీడీల చెల్లింపునకు తటపటాయిస్తున్నారు. పత్తికొండ స్టాక్‌ పాయింట్‌ పరిధిలోని ఐదు మండలాల చౌకదుకాణదారులు 190 మంది ఉండగా కేవలం 20 మంది మాత్రమే డీడీలు చెల్లించారని గోదాము బాధ్యుడు రవి చెప్పారు.

కమీషను మినహాయించుకుని సరకులివ్వాలి

కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్‌ నుంచి నవంబరు వరకు, రాష్ట్ర ప్రభుత్వం అక్టోబరు, నవంబరు నెలలకు మాకు కమీషన్‌ చెల్లించలేదు. ఈ పరిస్థితిలో కందిపప్పు, చక్కెరకు ధరలు పెంచి డీడీలు చెల్లించాలని పౌరసరఫరాల శాఖ ఆదేశాలు జారీ చేయడం బాధాకరం. మాకు చెల్లించాల్సిన కమీషన్‌ను మినహాయించి సరకులు ఇవ్వాలని రాష్ట్ర కమిటీ ప్రభుత్వానికి వినతిపత్రం ఇచ్చింది. - ప్రసాద్‌, తాలుకా డీలర్ల సంఘం అధ్యక్షుడు, పత్తికొండ

పెరిగిన ధరల మేరకు డీడీలు చెల్లించమన్నాం

కరోనా కారణంగా నవంబరుతో ఉచిత రేషన్‌ పథకం ముగిసింది. పెరిగిన ధరల మేరకు డిసెంబరు నెలకు సంబంధించిన సరకుల కోసం డీడీలు చెల్లించాలని డీలర్లను ఆదేశించాం. పెరిగిన ధరల మేరకే కార్డుదారులకు రేషన్‌ అందుతుంది. - సయ్యద్‌ యాసిన్‌, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి

ఇదీ చదవండి:

నేటి నుంచి మారేవి ఇవే..

ABOUT THE AUTHOR

...view details