ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆస్పత్రి రమ్మంటుంది...వైద్యం అందనంటుంది - ఈరోజు కర్నూలు జిల్లా తాజా వార్తలు

ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో సీహెచ్‌సీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. 2018లో ఓర్వకల్లు, పాణ్యం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సీహెచ్‌సీలుగా అప్‌గ్రేడ్‌ చేసినా.. సిబ్బంది ఏర్పాటు మరిచింది. కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి అన్ని వసతులతో నిర్మించిన భవనాల్లో సిబ్బంది కొరత వేధిస్తోంది. దీంతో పేదలకు వైద్యసేవలు అందడం లేదు. దీంతో అభివృద్ధితో పాటు వైద్య సేవలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి.

chc centres lowest
సీహచ్​సీ సెంటర్స్​

By

Published : Oct 25, 2020, 5:02 PM IST

ప్రజారోగ్యమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన సీహెచ్​లలో సిబ్బంది కొరత వేధిస్తోంది. కోట్లు ఖర్చుపెట్టి నిర్మించిన భవనాలు... వైద్య సిబ్బంది లేకపోవడంతో వృధా పడిఉన్నాయి. దీంతో పేదలకు వైద్య సేవలు అందడం లేదు.

ఓర్వకల్లు సీహెచ్‌సీ కేంద్రం

ఇటీవల ఏపీ వైద్యవిధాన పరిషత్తు రాష్ట్రంలోని సీహెచ్‌సీ ఆస్పత్రులు, అవి అందిస్తున్న సేవల ఆధారంగా ర్యాంకులు ఇచ్చింది. ఈ కేంద్రాల్లో అన్ని వసతులున్నా..సిబ్బంది మాత్రం తక్కువగా ఉన్నారు. ర్యాంకుల్లో ఓర్వకల్లు, పాణ్యం సీహెచ్‌సీ కేంద్రాలు సీ గ్రేడుతో రాష్ట్రంలోనే అట్టడుగున నిలిచాయి.

పాణ్యంలో పరిస్థితి అధ్వానం
పాణ్యం ప్రభుత్వ ఆస్పత్రిలో ఎనిమిది మంది వైద్యులు ఉండాల్సిన చోట ఇద్దరు మాత్రమే పనిచేస్తున్నారు. వైద్యశాలలో స్టాఫ్‌ నర్సులు 8 మంది, హెడ్‌ నర్స్‌ 1, వార్డుబాయిలు 4, అటెండర్‌ 2, ఫార్మసిస్టులు 2, వైద్యులు 8 మంది వరకు ఉండాలి. ప్రస్తుతం గైనకాలజిస్టు, చిన్నపిల్లలు, అనస్థీషియా వైద్యులు మాత్రమే ఉన్నారు. స్టాఫ్‌ నర్స్‌ ఒకరు, ఫార్మాసిస్టు ఒకరు మాత్రమే ఉండటంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. అన్ని వసతులున్నా వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయడంలో ఉన్నతాధికారుల నిర్లక్ష్యంతో అందాల్సిన సేవలు అందడం లేదు. సాయంత్రం 5 దాటితే వైద్యశాలలో ఎవరూ కనపడని పరిస్థితి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొన్ని కాన్పులు జరుగుతున్నా అత్యవసరమైతే సిబ్బంది లేకపోవడంతో నంద్యాలకు పంపాల్సి వస్తోంది. ఒకే ఒక స్టాఫ్‌ నర్స్‌ ఉన్నారు. అవసరం ఉన్నప్పుడు స్టాఫ్‌నర్స్‌ సెలవు పెడితే స్వీపర్లతోనే ఇంజక్షన్లు, మందులు ఇచ్చిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రజలకు అన్ని సేవలు అందించాల్సిన వైద్యశాలలో సిబ్బంది కొరతపై దృష్టి సారించకపోవడంపై పాణ్యం గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిబ్బంది తక్కువగా ఉన్నా ఇక్కడ విధులు నిర్వహించాల్సిన అటెండర్‌ను డిప్యుటేషన్‌పై బనగానపల్లికి పంపారు.

ఓర్వకల్లు సీహెచ్‌సీలో ఇలా..
ప్రధానంగా సీహెచ్‌సీల్లో ఓపీ, ల్యాబ్, రక్త నిల్వ కేంద్రం పనితీరు, కంటి వైద్య సేవలు, కు.ని శస్త్ర చికిత్సలు, ప్రసూతి సేవల ఆధారంగా గ్రేడ్లు, మార్కులు కేటాయిస్తారు. ఇండియన్‌ పబ్లిక్‌ హెల్త్‌ స్టాండర్డ్స్‌ ప్రకారం సీహెచ్‌సీలకు మెడికల్‌ సూపరింటెండెంట్‌తో పాటు ఐదుగురు స్పెషలిస్టులు, ఇద్దరు జనరల్‌ డ్యూటీ వైద్యులు, స్టాఫ్‌ నర్సులు 10 మంది, ఫార్మసిస్టులు 2, ల్యాబ్‌ టెక్నీషియన్లు 2, ఇతర సిబ్బంది మరో పదిమంది ఉండాల్సి ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఇద్దరు వైద్యులతో పాటు ఒక్క స్టాఫ్‌ నర్సు మాత్రమే అందుబాటులో ఉన్నారు. గైనకాలజిస్టు లేనందున కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కుంటుపడ్డాయి. ఇక్కడ పనిచేస్తున్న కంటి వైద్యుడు..రెండేళ్ల క్రితం డిప్యుటేషన్‌పై డోన్‌కు వెళ్లటంతో కంటి పరీక్షలు కరవయ్యాయి. రక్తనిల్వ కేంద్రం లేకపోవటం, ఓపీ తగ్గిపోవటం తదితర కారణాలతో ర్యాంకుల్లో అట్టడుగున పడిపోయాయి.

ఇవీ చూడండి..

తెలంగాణ సరిహద్దుల వరకు బస్సు సర్వీసులు: ఏపీఎస్​ఆర్టీసీ

ABOUT THE AUTHOR

...view details