Chandrababu visit to Rayalaseema projects: ‘సాగునీటి ప్రాజెక్టుల సందర్శన’ పేరుతో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేటి నుంచి పర్యటన ప్రారంభించారు. పర్యటనలో భాగంగా ఆయన అనంతపురం, వైయస్సార్, ఉమ్మడి కర్నూలు జిల్లాల్లోని ప్రాజెక్టులను సందర్శించనున్నారు. ఈ క్రమంలో ఈరోజు ప్రాజెక్టుల విధ్వంసంపై 'యుద్ధభేరి' పేరిట ఉమ్మడి కర్నూలు జిల్లా నందికొట్కూరులో బహిరంగ సభ నిర్వహించారు.
జగన్.. ముక్కు నేలకురాసి రాజీనామా చేసి పో..బహిరంగ సభలోచంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ.. ముఖ్యమంత్రి జగన్‌పై నిప్పులు చెరిగారు. సీఎం జగన్ రాయలసీమ ద్రోహి అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ కోసం సీఎం జగన్ ఏనాడైనా పని చేశారా..? అని ప్రశ్నించారు. ముందుచూపుతో రాయలసీమలో నీటి ప్రాజెక్టులు చేపడితే.. వైస్సార్సీపీ ప్రభుత్వం దానిని పూర్తిగా నాశనం చేసిందని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని భూస్థాపితం చేస్తే తప్ప.. రాయలసీమకు న్యాయం జరగదని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రానికి అన్యాయం, రాయలసీమకు ద్రోహం చేసిన దుర్మార్గుడు.. సీఎం జగన్ రెడ్డి అని చంద్రబాబు ధ్వజమెత్తారు. సైకోలా ప్రవర్తించకుండా రాయలసీమ ప్రాజెక్టులకు ఏం చేశాడో..? జగన్ రెడ్డి చెప్పాలన్న చంద్రబాబు.. చెప్పలేని పక్షంలో రాయలసీమలో ముక్కు నేలకు రాసి రాజీనామా చేసి పోవాలన్నారు.
ప్రాజెక్టులు పూర్తి చేసి, ధరలు తగ్గిస్తాం.. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే.. ఏయే కార్యక్రమాలు, ప్రాజెక్టులు పూర్తి చేయనున్నారో చంద్రబాబు నాయుడు ప్రజలకు వివరించారు. టీడీపీ వచ్చాక.. ప్రాజెక్టులను పూర్తి చేసి చూపిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన మినీ మేనిఫెస్టో సూపర్ హిట్ అయ్యిందన్నారు. మహిళలు, రైతులు, నిరుద్యోగ యువతకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. నూతన విద్యుత్ విధానం తెచ్చి.. విద్యుత్ చార్జీలు తగ్గించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందన్నారు. సీఎం జగన్.. నాసిరకం మద్యం సరఫరాతో పేదల రక్తాన్ని తాగుతున్నాడని.. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాత మద్యం విధానాన్ని తెచ్చి.. ధరలు తగ్గిస్తామన్నారు. ఆ తర్వాత నాసిరకం మద్యం నుంచి విముక్తి కలిగిస్తామన్నారు.