ప్రకృతి వనరుల సంరక్షణతో భావితరాల లబ్ధికి కృషి చేయాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. తుంగభద్ర పుష్కరాల సందర్భంగా తెలుగువారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం హయాంలో పంచనదుల అనుసంధానం, జలసిరికి హారతి, జల సంరక్షణా చర్యలు తదితర కార్యక్రమాలను చేపట్టామని గుర్తుచేశారు.
తమ పాలనలో ప్రకృతి వనరుల పరిరక్షణ, రైతులు-పేదల సంక్షేమం, అన్నివర్గాల ప్రజల అభ్యున్నతి లక్ష్యంగా కృషి చేశామని చంద్రబాబు అన్నారు. తుంగభద్ర పుష్కరాలు తెలుగు వారందరి ఉజ్వల భవిష్యత్తుకు, అన్ని రంగాల్లో అభ్యుదయానికి దోహదపడాలని ఆకాంక్షిస్తున్నాట్లు పేర్కొన్నారు. కరోనా వైరస్ ప్రమాదం పొంచివున్న కారణంగా పుష్కర యాత్రికులు, అన్నివర్గాల ప్రజలు ముందు జాగ్రత్తలు తీసుకుంటూ పూర్తి అప్రమత్తంగా ఉండాలని సూచించారు.