కర్నూలు జిల్లాలో తెదేపా అధినేత చంద్రబాబు పర్యటన రెండోరోజు కొనసాగింది. వైకాపా బాధితులతో సమావేశమైన చంద్రబాబు... వారి బాధలు విన్నారు. జిల్లావ్యాప్తంగా తెదేపా నాయకులు, కార్యకర్తలపై 33 కేసులు పెట్టారని, 10 దాడులు జరిగాయని, ఇద్దరు కార్యకర్తలు ఆత్మహత్య చేసుకున్నారని చంద్రబాబు వెల్లడించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బాధితులు... వైకాపా ప్రభుత్వం తమపై ఏ విధంగా దాడులకు పాల్పడుతోందో వివరించారు.
కూరగాయలు అమ్ముతున్నాను..!
తమ చిన్న తమ్ముడిని వైకాపా కార్యకర్తలు హత్యచేశారని బాధిత కుటుంబానికి చెందిన భారతి... చంద్రబాబు వద్ద వాపోయింది. ఫార్మసీ చేసిన తాను ఉద్యోగం మానేసి... ప్రస్తుతం రైతుబజార్లో కూరగాయలు అమ్ముకుంటున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. తమ కుటుంబానికి ఇలాంటి పరిస్థితి రావడంతో... తన జీవితం నాశనమైపోయిందని కన్నీటి పర్యంతమైంది. ఎన్ని కష్టాలు వచ్చినా భయపడేది లేదని... వెనకడుగేసే ప్రసక్తే లేదని పేర్కొంది.