CBN FIRES ON YSRCP : కర్నూలులో తెదేపా కార్యాలయం వద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పార్టీ కార్యాలయం వద్దకు వస్తున్నారని.. వైసీపీ కార్యకర్తలు మూడు రాజధానులు కావాలంటూ నినాదాలతో అక్కడకు చేరుకున్నారు. న్యాయవాదులు, విద్యార్థి సంఘాల నాయకులు కూడా అక్కడికి చేరుకున్నారు. చంద్రబాబు గో బ్యాక్ అంటూ వైసీపీ శ్రేణులు నినాదాలు చేశాయి. దీంతో సీఎం డౌన్ డౌన్ అంటూ తెదేపా కార్యకర్తలు పోటీగా నినాదాలు చేశారు. ఈ నినాదాలతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇలా నినాదాలు చేస్తున్న సమయంలోని చంద్రబాబు అక్కడకు చేరుకున్నారు. వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య వివాదం తారాస్థాయికి చేరుకుంది. అక్కడ పోలీసులు ఉన్నా.. అదుపు చేయకపోవటంతో చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓడిపోతారని తెలిసే జగన్ ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని విమర్శించారు. పేటీఎం బ్యాచ్‌కు బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి రెచ్చగొట్టి పంపారని.. ఈ రాత్రికి ఇక్కడే ఉంటా.. మీ సంగతి చూస్తా అని హెచ్చరించారు. రాజకీయ రౌడీలను అణచివేయడం తనకు కష్టం కాదని తెలిపారు. ఆడబిడ్డల పట్ల ఇష్టానుసారం ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ధర్మాన్ని కాపాడేందుకు అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
చంద్రబాబు ఆగ్రహం:కర్నూలు నగరంలో అడ్డుకోవడానికి వచ్చిన వైకాపా నాయకులు, కార్యకర్తలు, న్యాయవాదులు, విద్యార్థి జేఏసీ నాయకులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా నాయకుల తీరుపై, ముఖ్యమంత్రి జగన్‌పై విమర్శలు గుప్పించారు. చేతకాని దద్దమ్మ జగన్ అని దుయ్యబట్టారు. పోలీసుల తీరు వల్ల కర్నూలు ఎస్పీపై చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పోలీసులు యూనిఫాం తీసేసి రావాలని.. పోలీసుల వల్ల కాకపోతే మేమే చూసుకుంటామని అన్నారు. ఎస్పీ ఏం చేస్తున్నారని, ఎవరికి కాపలా కాస్తున్నారని నిలదీశారు.