Chandrababu Fire On YSRCP Govt: జగన్ ఓ ఐరన్ లెగ్ అని.., రాష్ట్రానికి శని గ్రహంలా పట్టుకున్న అరిష్టాన్ని తరిమి కొట్టాలని తెదేపా అధినేత చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లిలో రోడ్డు షో నిర్వహించారు. తాను ఐటీ ఉద్యోగాలు ఇప్పిస్తే.. జగన్ వాలంటరీ ఉద్యోగాలు ఇప్పించారని ఎద్దేవా చేశారు. జగన్ పాలనలో ధరలు విపరీతంగా పెరిగాయని.. అభివృద్ధి అటకెక్కిందని మండిపడ్డారు. శ్రీలంకలో ఏం జరుగుతుందో ఏపీలోనూ అదే జరుగుతోందని విమర్శించారు. నందికొట్కూరులో వైకాపా నేతలు భూ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. కర్నూలుకు హైకోర్టు ఎందుకు తరలించలేదని.., ప్రత్యేక హోదా ఎందుకు సాధించలేదని జగన్ను నిలదీశారు.
ఈసారి ఛీత్కారం తప్పదు..:బాదుడే బాదుడే కార్యక్రమంతో వైకాపాలో వణుకు మొదలైందని చంద్రబాబు అన్నారు. గడప గడపకూ వైకాపా ప్రభుత్వంలో వస్తున్న నిరసనలను తప్పించుకునేందుకే.. బస్సు యాత్ర పేరిట మరో నాటకం ఆడుతున్నారని విమర్శించారు. ప్రజలను మభ్యపెట్టేందుకు ఎన్ని వేషాలు వేసినా.. వైకాపాకు ఈసారి ఛీత్కారం తప్పదన్నారు. ఐదేళ్లు పాలించే సత్తాలేకనే జగన్ ముందస్తుకు సిద్ధమవుతున్నాడని ఎద్దేవా చేశారు.
"బీసీ జనార్దన్ రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడితే జైలుకెళ్లి వచ్చారు. అవినీతి కేసులున్న వ్యక్తి మాపై కేసులు పెడతారా ?. పైశాచిక ఆనందం పొందుతున్న వ్యక్తికి గుణపాఠం చెబుతాం. నంద్యాలలో సత్తార్ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. గుంటూరు, ఒంగోలులో మహిళలపై అత్యాచారాలు. రాష్ట్రంలో ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటా. రాష్ట్రాన్ని కాపాడాలంటే కార్యకర్తలు పోరాడాలి. రోజుకు ఎక్కడోచోట రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలి." - చంద్రబాబు, తెదేపా అధినేత