CBN COMMENTS AT ADONI ROAD SHOW: రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయి.. అవినీతి పెరిగిపోయిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. కర్నూలు జిల్లా ఆదోనిలో రోడ్ షోలో జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన చంద్రబాబు.. ఇసుక, మద్యం, భూకబ్జాలు పెరిగాయని ధ్వజమెత్తారు. రాష్ట్రం బాగుపడాలంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలని స్పష్టం చేశారు.
వైఎస్సార్సీపీ దాడులకు భయపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. అన్నింటిపై ఛార్జీల మోత మోగిస్తున్నారని.. ఆఖరికి చెత్తపైనా పన్ను వేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇసుక ఎక్కడా దొరికే పరిస్థితి లేదని.. ఎవరైనా ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాసిరకం మద్యం విక్రయిస్తూ.. పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా భూకబ్జాలు, ఇసుక, మద్యం దందాలు పెరిగిపోయాయని ధ్వజమెత్తారు.