ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్నూలు జిల్లాలో నిరాశాజనకంగా సీసీఐ పత్తి కొనుగోళ్లు - కర్నూలులో పత్తి కొనుగోలు కేంద్రాలు

కర్నూలు జిల్లాలో భారత పత్తి సంస్థ (సీసీఐ) రైతుల నుంచి పత్తి కొనుగోళ్లను ప్రారంభించినా పెద్దగా స్పందన లభించటం లేదు. కఠినమైన నిబంధనలు, పెద్దగా ప్రచారం చేయకపోవటం తదితర కారణాలతో... రైతులు ప్రైవేటు వ్యాపారులనే ఆశ్రయిస్తున్నారు. పత్తిలో నాణ్యత లేదన్న కారణంగా తక్కువ ధరకే పత్తిని సీసీఐ కొనుగోలు చేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

cci cotton purchase in kurnool district
కర్నూలు జిల్లాలో నిరాశాజనకంగా సీసీఐ పత్తి కొనుగోళ్లు

By

Published : Nov 14, 2020, 11:38 AM IST

కర్నూలు జిల్లాలో 2.69 లక్షల హెక్టార్లలో పత్తిపంట సాగయింది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా కొంతమేర పంట దెబ్బతింది. దీనికి తోడు అక్కడక్కడా గులాబీరంగు పురుగు దిగుబడులపై ప్రభావం చూపింది. ప్రస్తుతం రోజుకు సరాసరిన 20 నుంచి 25 వేల క్వింటాళ్ల పత్తి దిగుబడులు వస్తున్నట్లు అంచనా. ఈ తరుణంలో రైతుల నుంచి పత్తిని కొనేందుకు భారత పత్తి సంస్థ ముందుకు వచ్చింది. జిల్లాలో ఈనెల 4 నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభించింది. అయితే కొనడం ప్రారంభించి 10 రోజులు అయినా ఇంతవరకు రైతుల నుంచి కొనుగోలు చేసింది 250 క్వింటాళ్లు మాత్రమే.

భారత పత్తి సంస్థ (సీసీఐ) ద్వారా పత్తిని అమ్ముకోవాలంటే రైతులు కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. మొదట ఈ- క్రాప్ ద్వారా పంట నమోదు చేసుకోవాలి. రైతు భరోసా కేంద్రంలో ఆధార్ కార్డు, పాస్ బుక్, బ్యాంకు ఖాతా తీసుకువెళ్లి పేర్లు నమోదు చేసుకోవాలి. వారు అన్నీ పరిశీలించి ఏ కేంద్రంలో, ఎప్పుడు పత్తిని అమ్ముకోవాలో నిర్ణయిస్తారు. అప్పుడు పంటను సీసీఐ కేంద్రానికి తీసుకువెళ్లి విక్రయించుకోవచ్చు. పత్తిలో తేమ శాతం 8కి మించితే పెరిగిన ఒక్కో శాతానికి 55.15 రూపాయల చొప్పున ధర తగ్గుతుంది. 12 శాతానికి మించితే కొనుగోలు చేయరు. రైతు భరోసా కేంద్రాల్లో నమోదు చేసుకోనివారు సీసీఐ కేంద్రంలో తమ వివరాలు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం పత్తిలో నాణ్యత లేదని తక్కువ ధరకే రైతుల నుంచి సీసీఐ కొనుగోలు చేస్తున్నట్లు రైతులు అంటున్నారు.

కర్నూలు జిల్లాలో 10 పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఆదోనిలో 5, నంద్యాల 2, ఎమ్మిగనూరు 2, కర్నూలులో ఒకటి చొప్పున ఏర్పాటు చేశారు. 2020- 21 సంవత్సరానికిగాను క్వింటా పత్తికి రూ. 5,825 మద్దతు ధర ప్రకటించారు. పత్తిని కొనుగోలు చేసిన వారం రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బు వేస్తామని అధికారులు తెలిపారు.

సీసీఐ మద్దతు ధర ఆశాజనకంగా ఉన్నా నిబంధనలు సవరించాల్సిన అవసరం ఉందని రైతులు అంటున్నారు. దీని గురించి విస్తృతమైన ప్రచారం చేయాల్సిన ఆవశ్యకత ఉందని రైతు సంఘాలు సూచిస్తున్నాయి.

ఇవీ చదవండి..

కరోనా వేళ దిల్లీకి చిత్తూరు పాలు... కొరత రాకుండా దక్షిణమధ్య రైల్వే సరఫరా

ABOUT THE AUTHOR

...view details