State Cancer Institute: క్యాన్సర్ రోగులకు వరప్రదాయినిగా భావించిన... స్టేట్ క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం పనులు నత్తను తలపిస్తున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లైనా, ఈ ఆసుపత్రి పనులు పూర్తి చేయలేక ఆపసోపాలు పడుతోంది. ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పలేని దయనీయ స్థితిలో ప్రస్తుత పరిస్థితి నెలకొంది.స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ పనులపై ఈటీవీ భారత్ పరిశీలనాత్మక కథనం.
రాయలసీమ ప్రాంతంలోని పేద, మధ్యతరగతి ప్రజలకు క్యాన్సర్ లాంటి భయంకర జబ్బులు వస్తే.. వైద్యం చేయించుకోలేని పరిస్థితులో మృత్యువాత పడుతున్నారు. ఇలాంటి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలుగుదేశం అధికారంలో ఉండగా స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ను కర్నూలులో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీని కోసం కర్నూలు మెడికల్ కళాశాల ఆవరణలో 9.5 ఎకరాల విస్తీర్ణంలో 120 కోట్ల వ్యయంతో 200 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 2019 జనవరి 8వ తేదీన నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. 13 నెలల్లో పూర్తి కావాలని ఆదేశించారు.
మొదటిదశలో కేంద్ర ప్రభుత్వం 54 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం 36 కోట్లు కేటాయించడంతో పనులు ప్రారంభించారు. 2020 నాటికి ఆసుపత్రిని పూర్తి చేయాల్సి ఉంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆసుపత్రి పనులు పూర్తిగా మందగించాయి. మొదట్లో ఇసుక అందుబాటులో లేకపోవటం, ఆ తర్వాత నిధులు కేటాయించకపోవడంతో పనులు నత్త నడకన సాగాయి. ప్రస్తుతం 3 కోట్ల పనులకు సంబంధించి బిల్లులు రాకపోవటంతో, గుత్తేదారు పనులు మరింత ఆలస్యం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు 84 కోట్ల రూపాయల పరికరాలు తీసుకురావాల్సి ఉంది. అవి కూడా అమెరికా నుంచి రావాల్సి ఉండటంతో ఆలస్యమవుతోందని అధికారిక వర్గాలు తెలిపాయి.