కర్నూలు జిల్లా దేవరగట్టులో జరిగే బన్ని ఉత్సవాలకు అందరూ దూరంగా ఉండాలని సీఐ భాస్కర్ కోరారు. కరోనా కారణంగా ఈ ఏడాది బన్ని ఉత్సవాలను నిషేధించినట్లు తెలిపారు. ఆలూరు, హొళగుంద మండలాల్లో ఈనెల 25, 26వ తేదీల్లో పూర్తిగా లాక్‌డౌన్ విధించినట్లు స్పష్టం చేశారు. రెండు రోజులపాటు ఎవరూ దుకాణాలు తెరవకూడదని, రహదారులపై తిరగకూడదన్నారు.
'దేవరగట్టు బన్ని ఉత్సవాలకు అందరూ దూరంగా ఉండాలి' - దేవరగట్టు బన్ని ఉత్సవాల నిషేధం వార్తలు
కర్నూలు జిల్లా దేవరగట్టులో జరిగే బన్ని ఉత్సవాలను నిషేధించారు. 50 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటుచేశారు. ఆలూరు, హొళగుంద మండలాల్లో ఇప్పటికీ లాక్‌డౌన్ అమలువుతోంది.
బన్ని ఉత్సవాల నిషేధం నేపథ్యంలో ఏడుగురు డీఎస్పీలు, 28 మంది సీఐలు, 73 మంది ఎస్సైలతోపాటు వేయి మందికిపైగా పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇతర ప్రాంతాల ప్రజలు దేవరగట్టుకు వెళ్లకుండా 15 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు వివరించారు. గట్టు పరిసర ప్రాంతాల్లోని గ్రామాల్లో ఎస్సైతో పాటు పోలీసులు గస్తీ నిర్వహిస్తారని పేర్కొన్నారు. దేవరగట్టులో 50 సీసీ కెమెరాలతో నిఘా ఉంచుతామని వెల్లడించారు. ఆలూరు, హొళగుంద, హాలహర్వి మండలాల్లోని గ్రామాల్లో 10 నుంచి 25 మంది పేర్లను తీసుకున్నామని, పేర్లు నమోదు చేసుకున్నవారు మాత్రమే గట్టుకు వెళ్లి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. అందరూ సహకరించాలని ఆయన కోరారు.
ఇదీ చూడండి.గీతం వర్సిటీ భూములు ప్రభుత్వానికి చెందినవి: బొత్స సత్యనారాయణ