కర్నూలు జిల్లా శ్రీశైలంలో భ్రమరాంబ సమేత మల్లిఖార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా.. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి తరపున తితిదే ఈవో పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీశైలం దేవస్థానం వద్దకు చేరుకున్న జవహర్ రెడ్డి దంపతులకు.. ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి, ఏఈవో హరిదాసుతో పాటు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ, ప్రసాదాలు స్వీకరించారు. రాత్రి జరిగిన మల్లిఖార్జున స్వామి మయూర వాహన సేవలో పాల్గొన్నారు. తిరుమల దేవస్థానం తరపున ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని జవహర్ రెడ్డి హామీ ఇచ్చారు. యాత్రికుల వసతి సముదాయం మరమ్మతులు చేయిస్తామని ప్రకటించారు. ఎమ్మెల్యే, శ్రీశైలం ఆలయ ఈవోతో చర్చించి అభివృద్ధి పనులకు ప్రణాళికలు తయారు చేయిస్తామన్నారు.
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురంలో జరుగుతున్న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజు రాత్రి స్వామివారు రాజాధిరాజుగా గజ వాహనంపై అభయమిచ్చారు. ఏనుగు ఐశ్వర్యానికి ప్రతీక. రాజులను పట్టాభిషేకాది సమయాలలో గజాధిష్ఠితులను చేసి ఊరేగిస్తారు. ఒక విశిష్ఠ వ్యక్తిని ఘనంగా సన్మానించాల్సివస్తే గజారోహణం కావించే ప్రక్రియ నేటికీ ఉన్నది. విశ్వానికి అధిష్ఠానమూర్తి అయిన శ్రీనివాసుడు గజాన్ని అధిష్ఠించడం - జగత్తునూ, జగన్నాయకుడినీ ఒకేచోట దర్శించే మహాభాగ్యానికి చిహ్నం. స్వామి గజేంద్ర రక్షకుడు కనుక అందుకు కృతజ్ఞతగా ఏనుగు స్వామికి వాహనమై.. ఆయన సేవలో ధన్యం కావడం మహాఫలమని భక్తుల విశ్వాసం.