BJP MEETING: ‘రాష్ట్రంలో మైనార్టీ బుజ్జగింపు రాజకీయాలకు వ్యతిరేకంగా.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని నిద్ర లేపడానికి వచ్చా. దురాగతాలకు పాల్పడి పోలీసుస్టేషన్‌పై దాడి చేసినవారిని వదిలేసి భాజపా కార్యకర్తలపై కేసులు పెట్టాలని ప్రభుత్వం చెప్పడం దుర్మార్గం. ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ ఇలాంటి దాడులు చేయడంతో అక్కడి ప్రజలు సమాజ్‌వాదీ పార్టీని 2017 ఎన్నికల్లో ఓడించారు. అది గుర్తుపెట్టుకొని జగన్ ప్రభుత్వం గుణపాఠం నేర్చుకోవాలి. లేదంటే ఏపీ ప్రజలు వైకాపా ప్రభుత్వాన్ని పడగొడతారు.. సమాజ్‌వాదీ పార్టీకి పట్టిన గతే పడుతుంది’ అని భాజపా జాతీయ ప్రధానకార్యదర్శి అరుణ్‌సింగ్ అన్నారు. కర్నూలు ఎస్టీబీసీ మైదానంలో శనివారం నిర్వహించిన ‘ప్రజా నిరసన సభ’లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ), ఎస్డీపీఐ వంటి సంస్థల దుర్మార్గాలపై రాష్ట్రప్రభుత్వం కఠినచర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. అఖిలేశ్ యాదవ్ ప్రభుత్వంలో పనిచేసిన ఓ మంత్రి మతకలహాలు సృష్టించిన ముస్లింలపై చర్యలు తీసుకోకుండా ప్రయత్నం చేసి.. చివరకు జైలుకు వెళ్లాల్సి వచ్చిందని గుర్తుచేశారు. ఏపీలో అలాంటి ఓటుబ్యాంకు రాజకీయాలు చేస్తే అదే పరిస్థితి తలెత్తుతుందని హెచ్చరించారు. కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్, అసోం, త్రిపురలో సైతం ఇలాంటి ఓటు బ్యాంకు విధానాలను గుర్తించిన ప్రజలు భాజపా వైపు మొగ్గు చూపారన్నారు. ప్రధాని నరేంద్రమోదీ అన్ని మతాలనూ సమానంగా చూస్తున్న విధానాలు చూసి జగన్‌మోహన్‌రెడ్డి మారాలని.. లేదంటే మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.
భాజపాతో పరాచికాలొద్దు... కొవిడ్ లేకుండా ఉంటే వేలాదిగా కార్యకర్తలు హాజరై దురాగతాలను ఎండగట్టేవారని అరుణ్‌సింగ్ అన్నారు. మోదీ ప్రభుత్వం పేదలకు అందిస్తున్న బియ్యం, పింఛన్లు, ఇళ్లు వంటి పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం స్టిక్కర్లు వేసుకుంటోందన్నారు. రాష్ట్రంలో అప్పుల పాలన జరుగుతోందని.. ఉద్యోగులకు ఒకటో తేదీకి జీతాలొచ్చే పరిస్థితి లేదని, పింఛనుదారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. విచిత్రంగా పీఆర్సీని తగ్గించారని, అధికారమిచ్చిన వారికి న్యాయం చేయాలని డిమాండు చేశారు. జగన్‌కు సద్బుద్ధి రావాలని, బుడ్డ శ్రీకాంత్‌రెడ్డిపై పెట్టిన కేసులు ఉపసంహరించుకొనేలా, వెంటనే విడుదల చేసేలా అవసరమైతే యజ్ఞాలు చేయాలన్నారు.
ఇది మతతత్వ ప్రభుత్వం: సోము వీర్రాజు
రాష్ట్రప్రభుత్వ వ్యతిరేక వైఖరికి నిరసనగా కర్నూలు నుంచి సమర శంఖం పూరిస్తున్నామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. రాష్ట్రప్రభుత్వ మతతత్వ పోకడలకు నిరసనగా ఈ సభలు 175 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎస్డీపీఐకి చెందినవారు ఆత్మకూరులో బుడ్డా శ్రీకాంత్‌రెడ్డిపై హత్యాయత్నం చేశారన్నారు. ఓటుబ్యాంకు వైఖరితో 24 గంటల్లో మసీదును నిర్మించాలని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ప్రయత్నించారన్నారు. జగన్ ప్రభుత్వం మతతత్వ ప్రభుత్వమని, బుడ్డా శ్రీకాంత్‌రెడ్డిపై 12 దొంగకేసులు పెట్టి రౌడీషీట్ తెరవడం సిగ్గు చేటన్నారు. అక్రమంగా బనాయించిన కేసులు ఉపసంహరించుకోవాలన్నారు.
బెయిలుపై జగన్ స్వేచ్ఛగా తిరుగుతున్నారు