కర్నూలు జిల్లావ్యాప్తంగా ఉన్న వివిధ ఆసుపత్రుల్లో కొవిడ్ టీకా పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ ప్రక్రియను పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రారంభించారు.
కర్నూలు సర్వజన వైద్యశాలలో..
కర్నూలు సర్వజన వైద్యశాలలో కొవిడ్ టీకా పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ వీరపాండియన్ ప్రారంభించారు. తొలి విడతలో భాగంగా 35,470 మంది ప్రభుత్వ, ప్రయివేటు హెల్త్ కేర్ వర్కర్స్కు టీకాను అందించనున్నామని అన్నారు. అందుకోసం కోసం 147 కేంద్రాలను సిద్ధం చేశామని తెలిపారు.
నంద్యాలలో..
నంద్యాల ప్రభుత్వ వైద్యశాలలో కొవిడ్ టీకా పంపిణీ కార్యక్రమాన్ని ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, సబ్ కలెక్టరు కల్పన కుమారి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తొలుత.. కొవిడ్ టీకాను వైద్య సిబ్బందికి అందించారు.
ఆదోనిలో..
ఆదోనిలోని రెండు కేంద్రాల్లో కొవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియ మొదలైంది. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ఆరోగ్య శాఖలో పనిచేసే వర్కర్లకు టీకాను అందించారు. విడతల వారీగా వ్యాక్సిన్‌ను ప్రభుత్వం అందరికీ అందించనుందని అన్నారు. టీకాపై వస్తున్న అపోహలను నమ్మొద్దని పేర్కొన్నారు. మొదటి దశలో ఆసుపత్రిలో పనిచేసే సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకు అందజేస్తామని వైద్యులు తెలిపారు.
పత్తికొండ నియోజకవర్గంలో..
పత్తికొండ నియోజకవర్గంలోని మద్దికేర ప్రాథమిక పాఠశాలలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను ఎమ్మెల్యే శ్రీదేవి ప్రారంభించారు. ప్రభుత్వం అందిస్తున్న కొవిడ్ టీకాను వేయించుకుని.. మహమ్మారిని తరిమికొడదామని అన్నారు. ఈ ప్రక్రియలో మొదటగా ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు ప్రాధాన్యతనివ్వనున్నామని పేర్కొన్నారు.
ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో..
ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలైంది. ఈ ప్రక్రియను ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి ప్రారంభించారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో కొవిడ్ మరణాలు తక్కువగా నమోదయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు. టీకాను అందరికీ ఉచితంగా అందించేందుకు ప్రధాన మోదీ చర్యలు తీసుకోవాలని అన్నారు. లేనిపక్షంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం విపలమవుతుందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: