కర్నూలు జిల్లాలో ఖరీఫ్‌లో 4,500 హెక్టార్లలో అరటి సాగైంది. నంద్యాల, మహానంది, రుద్రవరం, ప్యాపిలి, ఆళ్లగడ్డ, చాగలమర్రి, శిరివెళ్ల పరిధిలో పన్నెండు వేల మంది రైతులు పైగా అరటి పంట సాగు చేశారు. సుగంధ, యాలకి, పచ్చఅరటి, ఎర్ర అరటి వంటి రకాలు సాగయ్యాయి. దిగుబడి బాగా వచ్చిందనుకున్న సమయంలో ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. టన్నుకు రూ.8 వేల నుంచి రూ.10 వేలు పలికే అరటి ప్రస్తుతం రూ.వెయ్యి నుంచి రూ.2 వేల లోపే పలుకుతోంది. కొన్ని గ్రామాలకైతే కొనుగోళ్లకు వ్యాపారులే రాని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితితో నష్టాలు మూటగట్టుకున్న సాగుదారులు పంటలను డోజర్లతో దున్నేస్తున్నారు. కొన్నిచోట్ల పశువులకు వదిలేస్తున్నారు.
ఇలా రుద్రవరం పరిధిలో 450 ఎకరాల అరటి తోటలను చదును చేశారు. అరటి సాగుకు ఎకరాకు రూ.లక్ష వరకూ పెట్టుబడి పెట్టారు. హెక్టారుకు 60-70 టన్నుల దిగుబడి వచ్చింది. అక్టోబరు, నవంబరులో కురిసిన వర్షాలకు ఆకుమచ్చ తెగులు వచ్చింది. మచ్చలోకి ఇథిలేన్ గ్యాస్ వచ్చి చెట్టుపైనే కాయలు పండిపోతున్నాయని..కొన్ని రాలిపోతున్నాయని ఉద్యాన శాఖ ఏడీ బీవీ రమణ ‘ఈనాడు’కు తెలిపారు. దీంతో కొనుగోళ్లకు వ్యాపారులు ఆసక్తి చూపడం లేదు. అడపాదడపా కొనుగోలు చేసినా తక్కువ ధర చెల్లిస్తున్నారు.
మార్కెట్ యార్డు కల నెరవేరేదెన్నడు?
మహానందిలో అరటి దిగుబడులకు చిన్న మార్కెట్ యార్డు, శీతల గిడ్డంగి ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. మహానంది అరటి ఉత్పత్తుల సంఘం రైతులు పలుసార్లు దీనికోసం అర్జీలు అందజేశారు. బుక్కాపురంలో స్థలం ఇచ్చేందుకు గత తెదేపా ప్రభుత్వం సుముఖత చూపింది. ఆ తర్వాత కొత్త ప్రభుత్వం రావడంతో ప్రతిపాదన అటకెక్కింది. ప్రస్తుతం వ్యాపారులు రైతుల పొలాల వద్దకే వచ్చి గెలలు, టన్నుల ప్రకారం కొనుగోలు చేస్తున్నారు. ధరలు పూర్తిగా పడిపోయిన నేపథ్యంలో ప్రభుత్వమే దిగుబడులు కొనుగోలు చేసి అరటి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.