Avuku Tunnel Project Progress :"మన అందరికీ కనిపిస్తోంది అవుకు రిజర్వాయర్. ఇంతవరకు నాలుగు సంవత్సరాలు పూర్తైంది. టన్నెల్ నిర్మాణ పనులు పూర్తయ్యాయా అని అడుగుతున్నాను? పోతిరెడ్డిపాడు నుంచి 44 వేల క్యూసెక్కుల ఫ్లడ్ ఫ్లో డిశ్చార్జితో కాలువ పనులు పూర్తిచేస్తే.. రాయలసీమే కాదు.. ప్రకాశం, నెల్లూరు జిల్లాల వరకు ప్రతి ప్రాజెక్టు ఈ రోజు కళకళలాడుతుండేది. చంద్రబాబునాయుడు పుణ్యాన నాలుగు సంవత్సరాలైనా ప్రాజెక్టుల్లో నీళ్లుఉండవు." - 2017 జనవరి 6న ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో బనగానపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలు ఇవి..
Avuku Reservoir Construction works : ప్రతిపక్ష నేతగా జగన్ అవుకు టన్నెల్‌పై ఎంత ప్రేమ ఒలకబోశారో? తెలుగుదేశం ప్రభుత్వం టన్నెల్ పూర్తి చేయలేదంటూ ఎంత ఆగ్రహం వ్యక్తం చేశారో? ఆ టన్నెల్ నుంచి నీళ్లు తరలిస్తే ఎన్ని ప్రాజెక్టులు కళకళలాడి ఉండేవని ఆక్రోశం వెళ్లగక్కారో? సీమకు, కోస్తా జిల్లాలకు ఆ నీళ్లు ఎంతో ఉపయోగపడి ఉండేవని నాడు తెగ బాధ పడిపోయారు. తామే అధికారంలో ఉంటే ఎప్పుడో ఆ టన్నెల్ పూర్తి చేసి ప్రాజెక్టులు కళకళ లాడించేవాడిని అన్నట్లుగా బహిరంగంగానే ప్రజలను నమ్మబలికారు.
నత్తనడకన అవుకు, వెలిగొండ టన్నెల్ పనులు.. గడువులోగా పూర్తవటం కష్టమే..!
జగన్ మాటలు నమ్మి అధికారం ఇచ్చి నాలుగున్నరేళ్లయినా ఇప్పటికీ టన్నెల్ పనుల్లో కదలిక లేదని రైతులు వాపోతున్నారు. అవుకు టన్నెళ్ల నుంచి ఇప్పటికీ పూర్తిస్థాయిలో నీళ్లు వదిలేలా పనులు ఎందుకు పూర్తి చేయలేకపోయారని ప్రశ్నిస్తున్నారు. ఏడాదిలోనే అవుకు సొరంగాలు పూర్తి చేస్తామంటూ పలికిన పలుకులేమయ్యాయని నిలదీస్తున్నారు. ఐదు తొలి ప్రాధాన్య ప్రాజెక్టులు ఏడాదిలోనే పూర్తిచేస్తామంటూ.. అందులో అవుకు సొరంగాలు చేర్చారు కదా! ఇప్పటికీ ఆ మాట నెరవేర్చలేదేం అని రాయలసీమ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీ హయాంలో ప్రాజెక్టుకు బీజం :కడప జిల్లా సాగునీటి అవసరాలు తీర్చాలన్న ఉద్దేశంతో చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ సొరంగ మార్గాల పనులు ప్రతిపాదించారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2008 జనవరిలో పనులు ప్రారంభమయ్యాయి. 2009 తర్వాత పనులు ఆగిపోయాయి. 2014లో చంద్రబాబు మళ్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టాక నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి.
సుమారు 401 కోట్ల రూపాయల విలువైన ఆయా పనులను N.C.C., మైటాస్ సంస్థలు చేపట్టాయి. 12 మీటర్ల ఎత్తు, 12 మీటర్ల వెడల్పున ఏకంగా 5.6 కిలోమీటర్ల దూరం పాటు కొండలను తొలచి రెండు సొరంగ మార్గాలు తవ్వాలి. ఒక్కో సొరంగ మార్గాన్ని 10 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహ సామర్థ్యంతో నిర్మించాలి. అత్యంత సంక్లిష్టమైన ఆ ప్రక్రియలో పలు ఆటంకాలు ఎదురయ్యాయి.