కర్నూలు జిల్లాలో 3,621.408 కిలోమీటర్ల మేర రహదారులు ఉన్నాయి. వాటిలో 3,248 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 258.13 కిలోమీటర్ల సీసీ రహదారులు, 7.7 కిలోమీటర్ల మెటల్ రోడ్లు, 107.05 కిలోమీటర్ల ఇతర రోడ్లు ఉన్నాయి. ఈ ఏడాది అధిక వర్షాల వల్ల సగానికి పైగా రోడ్లన్నీ రాళ్లు తేలాయి. బురదమయంగా మారి వాహనదారులు, ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. పాడైన రోడ్లపై ప్రయాణించడం వల్ల వెన్ను, మెడ సంబంధ రోగాల బారిన పడుతున్నారు. మరికొందరు ప్రమాదాలకు గురవుతున్నారు.
దుర్భరంగా రహదారులు
కర్నూలు నగరంలోనూ రోడ్లు పాడయ్యాయి. తుంగభద్ర పుష్కరాల సందర్భంగా కొంత మేర ప్రధాన రహదారులకు మరమ్మతులు చేశారు. నగరంలోని బిర్లా గేట్, గుత్తి పెట్రోల్ బంక్, కల్లూరు చెన్నమ్మ సర్కిల్, కొత్త బస్టాండ్ ప్రాంతంలోని వక్కెర బ్రిడ్జి వద్ద రోడ్లు దుర్భరంగా తయారయ్యాయి. కౌతాళం మండలంలోని పలు రోడ్లు, ఆళ్లగడ్డ నుంచి అహోబిలం వెళ్లే దారి, ఆళ్లగడ్డ- కోట కందుకూరు, ఆళ్లగడ్డ-పీరయ్య పల్లె దారులు, ఆదోని నుంచి ఆలూరుకు వెళ్లే రోడ్లు, కర్నూలు- బళ్లారి రహదారి దారుణంగా మారాయి. సీ. బెళగల్ మండలంలోని నదీ తీర ప్రాంత రహదారులు, కర్నూలు-మంత్రాలయం రోడ్డు, మంత్రాలయం- నాగులదిన్నె, మిడుతూరు- నంద్యాల రహదారి, డోన్- కర్నూలు రోడ్డు, పోలూరు- కొండజూటూరు, కొండాపురం-మూడుమాల మధ్య, ఈర్లదిన్నె-కొత్తకోట, కొలిమిగుండ్లలోని రహదారులు మరింత అధ్వానంగా ఉన్నాయి.