ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Medical college: వైద్య కళాశాల అక్కడే ఎందుకు ఏర్పాటు చేయాలి? - ఏపీ హైకోర్టు వార్తలు

కర్నూలు జిల్లా నంద్యాలలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రానికి చెందిన భూమిలో వైద్య కళాశాల ఏర్పాటు ఎందుకని, వేరేచోట భూమిని అన్వేషించి అక్కడ ఎందుకు నెలకొల్పకూడదవి రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.

హైకోర్టు
హైకోర్టు

By

Published : Jun 18, 2021, 7:14 AM IST

నంద్యాలలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రానికి చెందిన భూమిలో వైద్య కళాశాల ఏర్పాటు ఎందుకని, వేరేచోట భూమిని అన్వేషించి అక్కడ ఎందుకు నెలకొల్పకూడదవి.. రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. పరిశోధనా కేంద్రం, వైద్య కళాశాల రెండూ ముఖ్యమేనని వ్యాఖ్యానించింది. ఈ విషయంపై ప్రభుత్వంతో చర్చించి వివరాల్ని కోర్టు ముందు ఉంచాలని..హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం.. అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్​కు సూచన చేసింది. విచారణను ఈ నెల 22 కు వాయిదా వేసింది.

వ్యవసాయ పరిశోధనా కేంద్రానికి చెందిన భూముల్ని.. వైద్య కళాశాల నిర్మాణానికి కేటాయింపు విషయంలో రెవెన్యూ శాఖ 2020 డిసెంబర్ 12 న జారీచేసిన జీవో 341 ను సవాలు చేస్తూ నంద్యాలకు చెందిన దశరథరామిరెడ్డి, మరో నలుగురు హైకోర్టులో పిల్ వేశారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది వివేక్ రెడ్డి వాదనలు వినిపించారు. వ్యవసాయ వర్సిటీకి చెందిన భూములను బోర్ ఆఫ్ డైరెక్టర్ల అనుమతి లేకుండా బదిలీ చేయడానికి వీల్లేదని.. కేబినెట్ నిర్ణయం తీసుకోవడానికి అవి ప్రభుత్వానికి చెందిన భూములు కాదన్నారు. ఆ భూములు కోల్పోతే రైతులపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ఈ వ్యవహారంపై నంద్యాల వ్యవసాయ పరిశోధనా కేంద్రం అసోసియేట్ డైరెక్టర్ వైఖరి తెలపాలని స్పష్టం చేసింది.

ప్రభుత్వ భూముల విషయంలోనే కేబినెట్ నిర్ణయం తీసుకోవచ్చు కాని.. వర్సిటీ భూముల విషయంలో కాదని వ్యాఖ్యానించింది. మరొకచోట భూమిని అన్వేషించి అక్కడ వైద్య కళాశాలను నెలకొల్పవచ్చుకదా అని పేర్కొంది. ఈ విషయంలో ఏజీ జోక్యం చేసుకొని ప్రభుత్వంతో మాట్లాడి స్పందన తెలపాలని సూచన చేసింది.

ఇవీ చదవండి

నేడు జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్న సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details