ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

AP SARPANCHES PROTEST: నిధులు ఖాతాల్లో జమ చేయాలంటూ సర్పంచుల భిక్షాటన..! - ఏపీలో సర్పంచుల ఆందోళన

రాష్ట్రంలోని పలు జిల్లా సర్పంచులు ఆర్థిక సంఘం నిధులను గ్రామ పంచాయతీల ఖాతాల్లోనే జమచేయాలంటూ ఆందోళనలు నిర్వహించారు. నిధులను పక్కదారి పట్టించడం సరికాదంటూ నినాదాలు చేశారు. కలెక్టర్​లను కలిసి వినతి పత్రాలు అంజజేశారు.

ap-sarpanches-protest-against-give-the-funds-of-15th-financial-commission
నిధులు ఖాతాల్లో జమ చేయాలంటూ సర్పంచుల భిక్షాటన..!

By

Published : Nov 26, 2021, 8:05 AM IST

SARPANCHES PROTEST IN AP: రాష్ట్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులు గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమచేయాలని ఏపీ పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాపరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆర్థిక సంఘం నిధులను పక్కదారి పట్టించడాన్ని నిరసిస్తూ ఏపీ పంచాయతీరాజ్‌ ఛాంబర్‌, కర్నూలు జిల్లా సర్పంచుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో గురువారం కర్నూలులో ర్యాలీ చేసి కలెక్టరేట్‌కు చేరుకున్నారు. కలెక్టర్‌ను కలిసేందుకు సర్పంచులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని, కొందరినే అనుమతించారు. వారు కలెక్టర్‌ కోటేశ్వరరావుతో మాట్లాడి వినతిపత్రం ఇచ్చారు. ప్రతాపరెడ్డి మాట్లాడుతూ పంచాయతీల తీర్మానంతో సంబంధం లేకుండా.. సర్పంచి సంతకం తీసుకోకుండా నిధులను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం దారుణమన్నారు. నిధులు జమ చేయకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. సర్పంచులు లెనిన్‌బాబు, భాగ్యమ్మ, హరిత రెడ్డి, ఎల్లయ్య, మాధవస్వామి తదితరులు పాల్గొన్నారు.

ప్రకాశం జిల్లాలో భిక్షాటన

దారి మళ్లించిన 14, 15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్రప్రభుత్వం వెంటనే పంచాయతీల ఖాతాలకు జమచేయాలని డిమాండ్‌ చేస్తూ ప్రకాశం జిల్లా పంచాయతీ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. గురువారం ఒంగోలులోని కలెక్టరేట్‌ వద్ద జరిగిన కార్యక్రమంలో సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు జి.వీరభద్రాచారి, అధ్యక్షుడు శ్రీరామమూర్తి, ప్రధాన కార్యదర్శి పగడాల రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. నిధులు తీసుకోవడంపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకూ సమాయత్తం కానున్నట్లు తెలిపారు. కలెక్టరేట్‌ నుంచి అంబేడ్కర్‌ భవన్‌ రోడ్డు మీదుగా చర్చి సెంటర్‌ వరకు భిక్షాటన చేశారు.

వీధిదీపాలూ వేయించలేని పరిస్థితి

పేరుకే సర్పంచులుగా ఉన్నా, కనీసం వీధిదీపాలు వేయించలేని స్థితిలో ఉన్నామని కడప జిల్లా సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు శివచంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం పలువురు సర్పంచులతో కలిసి కలెక్టర్‌ విజయరామరాజుకు ఆయన వినతిపత్రం అందించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ... 14, 15వ ఆర్థికసంఘం నిధులు లేక.. ఏ పనీ చేయించలేని దుస్థితిలో ఉన్నామన్నారు. ఇటీవలి వర్షాలకు గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపించిందని, పనులు చేయిద్దామంటే నిధులు కూడా లేవన్నారు.

ఇదీ చూడండి:CBN nellore tour: మద్యం అమ్మకాలపై వచ్చే ఆదాయంతో.. సంక్షేమ పథకాలు ఎవరడిగారు ?: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details