ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఓర్వకల్లు పారిశ్రామిక నోడ్​కు 3 వేల ఎకరాలే! - orvakallu node

కర్నూలు జిల్లాలో నిర్మించబోతున్న ఓర్వకల్లు పారిశ్రామిక నోడ్​కు కేటాయించే భూమిపై రాష్ట్ర ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. ముందుకా అనుకున్నట్లు ఒకేసారి 10 వేల ఎకరాలు కేటాయించకుండా... విడతల వారీగా కేటాయించాలని చూస్తోంది. అందులో భాగంగానే ముందుగా 3 వేల ఎకరాలను కేటాయించింది.

ap-government-sanctioned-only-3-thousand-acres-for-orvakallu-node
ఓర్వకల్లు పారిశ్రామిక నోడ్​కు 3 వేల ఎకరాలే!

By

Published : Jan 3, 2022, 7:51 AM IST

హైదరాబాద్‌ - బెంగళూరు కారిడార్‌లోని ఓర్వకల్లు పారిశ్రామిక నోడ్‌కు కేటాయించే భూములపై రాష్ట్ర ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. ముందుగా అనుకున్న ప్రకారం ఒకే సారి 10 వేల ఎకరాలు కేటాయించకుండా కేవలం 3 వేల ఎకరాలు మాత్రమే తొలివిడతగా ఇచ్చేందుకు నిర్ణయించింది. ఇలాగై పెద్ద పారిశ్రామికవేత్తలను చిన్న ప్రాజెక్టులు చేపట్టేలా ఈ ప్రాంతానికి తీసుకురావడం కష్టమవుతుందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ఇటీవల వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం స్థిరాస్తి వ్యవహారం కావడంతో జరగబోయే అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని భూమి కేటాయించాలనే నిర్ణయంతో ఉంది.

ఓర్వకల్లు మండలంలో సర్వే చేయించి 9,821 ఎకరాల ప్రభుత్వ, పట్టా భూమి ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఇందులో ఏపీఐఐసీ 7,100 ఎకరాలు సేకరించింది. ఈ భరోసాతోనే హైదరాబాద్‌ - బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో భాగమైన కర్నూలు జిల్లా ఓర్వకల్లు ప్రాంతంలో 10 వేల ఎకరాలు కేటాయించేందుకు రాష్ట్రం ప్రభుత్వం ముందడుగు వేసింది. దీంతో కేంద్రం 2020 ఆగస్టులో ఈ ప్రాంతాన్ని పారిశ్రామిక హబ్‌గా ప్రకటించింది. ఆ మేరకు నోడ్‌ అభివృద్ధి కోసం కేంద్రంలోని నేషనల్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ డెవలెప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఐసీడీసీ)కు భూములను అప్పగించాల్సి ఉంది. ఇలా చేస్తే భూ విలువ అంచనా వేసి అంతే సమానమైన పెట్టుబడిని ఎన్‌ఐసీడీసీ పెడుతుంది. భూమి అభివృద్ధి చేశాక అందులో సగం కేంద్రానికి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే.. భవిష్యత్తులో ఇంతకన్నా మంచి పథకాలు రావొచ్చన్న ఆలోచనతో ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం 3 వేల ఎకరాలు మాత్రమే ముందుగా ఇచ్చేందుకు నిర్ణయించింది. ఇచ్చిన భూమి అభివృద్ధి చెందితే మిగిలినవి ఇస్తామని, ముందుగా ఒప్పందం చేసుకోవడం ఎందుకనే ఆలోచనతో రాష్ట్రం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదే విషయంపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ‘ఈనాడు’తో మాట్లాడుతూ... ‘స్థిరాస్తి ఆచితూచి ఇస్తాం. అంత తొందర ఏముంది. మున్ముందు మరో ప్రైవేటు వ్యక్తులే మొత్తం పెట్టుబడి పెట్టి 75 శాతం భూమి మనకే ఇస్తాం అనొచ్చు కదా?. పైగా ఇప్పుడిచ్చే 3 వేల ఎకరాల్లో ఒకేసారి పరిశ్రమలూ రాకపోవచ్చు కదా? అందుకే ముందు ఇచ్చే భూముల్లో పరిశ్రమలు వచ్చి అభివృద్ధి చెందితే ఆ తర్వాత మిగిలిన భూమి ఇస్తాం’ అని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ ధోరణి చూస్తే.. ఇకపై మిగిలిన భూమిలో సొంతంగా పారిశ్రామిక పార్కు అభివృద్ధి చేయనున్నట్లుందని పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే బ్రాహ్మణపల్లెలో 43 ఎకరాలు అభివృద్ధి చేసి ఎంఎస్‌ఎంఈల కోసమని 40 మందికిపైగా ఔత్సాహికులకూ కేటాయించింది. ఇదే విధంగా నోడ్‌కు సేకరించే భూముల్లోనూ మౌలిక సదుపాయాలు కల్పించి పరిశ్రమలను ఆహ్వానించే ఏర్పాట్లలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి:

Crime Rate Increase in State: రాష్ట్రంలో పెరుగుతున్న చోరీలు, దోపిడీలు.. 2021లో 15.37 శాతం ఎక్కువ

ABOUT THE AUTHOR

...view details